
రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు పునరావృతం
● హామీలు నెరవేర్చకుండా
అరాచకాలు
● ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు (పొగతోట): ఎమర్జెన్సీ రోజులు ప్రస్తుత కూటమి పాలనలో రాష్ట్రంలో కనిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అరాచకాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని, వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు అండగా నిలవాల్సిన సమయంలో పత్రిక సంపాదకులపై కేసులు పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ను కొనుగోలు చేస్తే తప్పన్న కూటమి నేతలు ఇప్పుడు అంతకంటే అధిక ధరకు కొనుగోలు చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కుంభకోణాలతో కూటమి ప్రభుత్వం తలమునకలైందని విమర్శించారు. ఐపీఎస్ ఆంజనేయులును ఓ చిన్న కేసులో నెల రోజులుగా జైల్లో ఉంచడం దారుణమన్నారు. సీనియర్ ఐఏఎస్‌లు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం దారుణమని తెలిపారు. కూటమి నేతలను నిలదీసే రోజు త్వరలోనే రానుందని స్పష్టం చేశారు.