
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్-హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో పాల్గోనే అన్ని జట్లు తమ ఆస్త్ర శాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.
ఈ ఆసియా క్రికెట్ పోరు కోసం పాకిస్తాన్ ఇప్పటికే తమ సన్నహాకాలను ప్రారంభించనుంది. ఈ టోర్నీకి ముందు అఫ్గాన్, యూఏఈలతో ముక్కోణపు టీ20 పాక్ ఆడనుంది. మరోవైపు భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.
ఆసియాకప్-2023(వన్డే ఫార్మాట్) ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ సారి ఫార్మాట్ మారిన ఫలితం మాత్రం మారకూడదని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ఈ ఖండాంతర టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును సైతం ప్రకటించింది.
ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. అంతేకాకుండా శుబ్‌మన్ గిల్ తిరిగి టీ20 జట్టులో వచ్చాడు. ఈ ఆసియా జెయింట్స్ పోరులో సూర్యకు డిప్యూటీగా గిల్ వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
అద్బుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి సెలక్టర్లు వీరిని పరిగణలోకి తీసుకోలేదు ఇక ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో తాడోపేడో టీమిండియా తేల్చుకోనుంది.
టీమిండియా ఓపెనర్ ఎవరు?
కాగా టోర్నీలో భారత తుది జట్టు కూర్పు అనేది టీమ్ మెనెజ్‌మెంట్‌కు ఒక పెద్ద సవాలుగా మారనుంది. ముఖ్యంగా ఓపెనర్ల విషయంలో కెప్టెన్ సూర్య, హెడ్ కోచ్ గంభీర్ మల్లగుల్లాలు పడక తప్పదు. ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఫిక్స్ అయినప్పటికి.. అతడికి భాగస్వామిగా ఎవరిని పంపిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
ఎందుకంటే మరో స్లాట్ కోసం శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ ఇద్దరు పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. గిల్ గత కాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నప్పటికి ఐపీఎల్‌లో మాత్రం దుమ్ములేపాడు.
ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఓపెనర్‌గా అదరగొట్టాడు. ఓపెనర్‌గా గిల్ ఫామ్‌కు ఎటువంటి ఢోకా లేదు. మరోవైపు సంజూ కూడా ఓపెనర్‌గా అద్బుతంగా రాణిస్తున్నాడు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంసన్ టీ20ల్లో ఓపెనర్‌గా తనదైన ముద్రవేసుకున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఈ కేరళ క్రికెటర్ విజయవంతమయ్యాడు.
శాంసన్ 16 ఇన్నింగ్స్‌లలో 34.78 సగటుతో 487 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. కానీ బలమైన ఇంగ్లండ్ జట్టుపై మాత్రం ఈ కేరళ ఆటగాడు బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు.
అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి. కానీ ఐపీఎల్‌లో మాత్రం సంజూ తన బ్యాట్‌కు పని చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కేరళ ప్రీమియర్ లీగ్‌లోనూ ఓపెనర్‌గా వచ్చి పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో ఇద్దరు కూడా సూపర్ ఫామ్‌లో ఉండడంతో భారత్ ఇన్నింగ్స్‌ను అభిషేక్‌తో కలిసి ఎవరు ప్రారంభిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ అభిషేక్, గిల్‌ను ఓపెనర్లగా పంపాలని నిర్ణయించుకుంటే శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే అతడికి మిడిలార్డర్‌లో అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. సంజూకు బదులుగా జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశముంటుంది.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్
చదవండి: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్