Hardik Pandya: పొలార్డ్‌ వచ్చే ఏడాది గుజరాత్‌కు ఆడతాడేమో! నాకు ఆ 4 టైటిళ్లు ప్రత్యేకం!

IPL 2022: Hardik Pandya About Pollard Wishes To Play For Gujarat Titans Next - Sakshi

IPL 2022 MI Vs GT: వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌తో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సమయంలో వీరి మధ్య స్నేహం బలపడింది. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో ముంబై హార్దిక్‌ను వదిలేసి.. పొలార్డ్‌ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ హార్దిక్‌ పాండ్యాను సొంతం చేసుకుని తమ కెప్టెన్‌గా నియమించింది. ఇక ముంబై ఇండియన్స్‌ ఇప్పటి వరకు కేవలం తొమ్మిదింట ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా.. గుజరాత్‌ మాత్రం పది మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. 

ఇక ఈ రెండు జట్లు శుక్రవారం(మే 6) ముంబైలోని బ్రబౌర్న్‌ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న పొలార్డ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ముంబై జట్టుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

ఈ మేరకు హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఈరోజు పాలీ(పొలార్డ్‌) బాగా ఆడాలి. అయితే మేము మ్యాచ్‌ గెలవాలి. నువ్వు బాగానే ఉన్నావా అంటూ తనకు నేను మెసేజ్‌లు పెడుతూ ఉంటాను. ఒకవేళ నువ్వు వచ్చే ఏడాది గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడతావేమో అని సరాదాగా ఆటపట్టిస్తూ ఉంటాను. అది ఎప్పటికీ జరగదని నాకు తెలుసు. కానీ అలా జోక్‌ చేస్తూ ఉంటా’’ అని పేర్కొన్నాడు.

అదే విధంగా.. ‘‘2015 నాకు అత్యంత ముఖ్యమైనది. నాకౌట్‌ దశకు చేరాలంటే ఏడు మ్యాచ్‌లలో గెలవాల్సిన తరుణంలో నేను రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నా. అలా విజయంతో పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్నా. అప్పుడు నేను మూడు సిక్సర్లు కొట్టానుకుంటా.

చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు అవసరమైన వేళ మూడు నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకుంటే ఆ మజానే వేరు’’ అని గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు. ఇక గుజరాత్‌తోనూ తనకు ప్రత్యేక బంధం ఉందన్న హార్దిక్‌ పాండ్యా.. ముంబై జట్టు టైటిళ్లు గెలిచిన సందర్భంలో తాను కూడా ఆ జట్టులో భాగం కావడం మరింత ప్రత్యేకమని ఫ్రాంఛైజీ మీద అభిమానం చాటుకున్నాడు.

చదవండి👉🏾Rovman Powell: ఆ రికార్డు బద్దలు కొట్టాలి! 130 మీటర్లు.. నా లక్ష్యం అదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top