Carl Lewis: 35 ఏళ్ల వయసులో జంప్‌ సాధ్యమా.. సొంతగడ్డపై తొమ్మిదో స్వర్ణపతకంతో! ‘నో టు డ్రగ్స్‌’..

Carl Lewis Life Story Long Jump Victories Interesting Facts In Telugu - Sakshi

1996...అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొనే అమెరికా అథ్లెటిక్స్‌ జట్టు కోసం ట్రయల్స్‌ జరుగుతున్నాయి. లాంగ్‌జంప్‌లో కార్ల్‌ లూయీస్‌ రెండు ప్రయత్నాలు అయిపోయాయి. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు ఉన్నా, ఈసారి మాత్రం అతనిపై ఎలాంటి అంచనాలు లేవు. 35 ఏళ్ల వయసులో జంప్‌ సాధ్యమా అనే విమర్శలే ఎక్కువగా వినిపించాయి. కానీ కార్ల్‌కు మాత్రం తనపై చాలా నమ్మకముంది.

శక్తినంతా కూడదీసుకొని చివరి ప్రయత్నంలో లంఘించాడు. ఎట్టకేలకు మూడో స్థానంలో నిలిచి అర్హత సాధించాడు. అయితే అతను క్వాలిఫై కావడంతోనే ఆగిపోలేదు. సొంతగడ్డపై జరిగిన ఒలింపిక్స్‌ అసలు సమరంలో కూడా సత్తా చాటాడు. అన్ని అంచనాలనూ పటాపంచలు చేస్తూ 8.50 మీటర్ల జంప్‌తో అగ్రస్థానం సాధించి ఓవరాల్‌గా తొమ్మిదో స్వర్ణపతకంతో చరిత్ర సృష్టించాడు.

ఒకే ఈవెంట్‌లో వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలోనూ స్వర్ణాలు గెలిచి ఏకైక అథ్లెట్‌గా నిలిచి∙ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అనిపించుకున్నాడు. పోటీ ముగిసిన రాత్రి తాను జంప్‌ చేసిన పిట్‌ వద్దకు వెళ్లి ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో అక్కడి ఇసుకను తీసుకున్నాడు. దానిని ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా తనతో ఉంచుకున్నాడు. 

స్వదేశంలో జరిగిన 1984 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు గెలిచిన తర్వాత కూడా కార్ల్‌ లూయీస్‌కు స్టార్‌ హోదా రాలేదు. నిజానికి అమెరికన్‌ అథ్లెట్లు అలాంటి ప్రదర్శన చేస్తే కార్పొరేట్‌ కంపెనీలు, స్పాన్సర్లు వెంటపడతాయి. మున్ముందు మరింత విలువ పెరుగుతుందని భావించి ఒలింపిక్స్‌కు ముందు ఇచ్చిన కోకాకోలా ఆఫర్‌ను అతను తిరస్కరించాడు.

ఇది చెడ్డపేరు తీసుకు రాగా, అతనితో పాటు అతని మేనేజర్‌ వ్యవహారశైలి, నోరు జారిన వ్యాఖ్యలతో లూయీస్‌కు పెద్ద కంపెనీలు దూరమయ్యాయి. అభిప్రాయభేదాల కారణంగా ‘నైకీ’తో కూడా ఒప్పందం రద్దయింది. ఇలా దాదాపు మూడేళ్ల పాటు ఆటలో అద్భుతాలు చేసినా, ఘనమైన ఫలితాలు సాధించినా అవేవీ అతని స్థాయిని పెంచలేదు. ప్రతిష్ఠాత్మక 1987 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ 100 మీటర్ల పరుగులో అతను బెన్‌ జాన్సన్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు (ఆ తర్వాత జాన్సన్‌ డోపింగ్‌ కారణంగా స్వర్ణం లూయీస్‌కే దక్కింది).

మానసికంగా దీని వల్ల కొంత దెబ్బతిన్న స్థితిలో విషాదం అతని దరిచేరింది. ఆటలో ఓనమాలు నేర్పించి ప్రపంచాన్ని జయించే వరకు అన్నీ అయి నడిపించిన తండ్రి అనూహ్యంగా మరణించాడు. తాను ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలు నెగ్గినా అన్నింటికంటే 100 మీటర్ల పరుగంటేనే తనకు ఇష్టమని తండ్రి చెప్పేవాడు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఆయన చేతిలో తన ఒలింపిక్స్‌ స్వర్ణాన్ని ఉంచి ఖననం చేశాడు.

ఇదేమిటని తల్లి వారించగా.. ‘ఫర్వాలేదమ్మా...మరొకటి గెలిచి చూపిస్తాను’ అని మాటిచ్చాడు. నిజంగానే కొద్ది రోజుల తర్వాత జరిగిన 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో అతను 100 మీటర్ల పరుగులో మళ్లీ స్వర్ణం సాధించి చూపించాడు. ఇదే పోటీల్లో తన ఫేవరెట్‌ ఈవెంట్‌ లాంగ్‌జంప్‌లో స్వర్ణంతో పాటు 200 మీటర్ల పరుగులో రజతం కూడా గెలిచి తానేంటో నిరూపించాడు. ఈ పోటీల్లో సాధించిన విజయాలు అతని దిగ్గజ హోదాకు బాటలు వేశాయి. 

వరుస రికార్డులతో...
17 సంవత్సరాలు... అంతర్జాతీయ స్థాయిలో ఒక అథ్లెట్‌పరంగా చూస్తే ఇది చాలా పెద్ద కెరీర్‌. కఠోర శ్రమ, పట్టుదలతో లూయీస్‌ ఈ స్థాయికి చేరుకున్నాడు. అలబామాలోని బర్మింగ్‌హామ్‌ అతని స్వస్థలం. హర్డ్‌లర్‌ అయిన తల్లితో పాటు తండ్రికి కూడా క్రీడలపై అమితాసక్తి ఉండేది. వారిద్దరూ స్థానికంగా ఒక అథ్లెటిక్స్‌ క్లబ్‌ నడిపేవారు. దాంతో సహజంగానే అతడిని పరుగు ఆకర్షించింది. పాఠశాల స్థాయిలోనే అతని సత్తా అందరికీ తెలిసింది.

ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన జూనియర్‌ లాంగ్‌జంపర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లూయీస్‌ వరుసగా రికార్డులు నెలకొల్పాడు. కాలేజీ స్థాయిలోనూ ఇదే జోరు కొనసాగిస్తూ 8.13 మీటర్ల జంప్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. 1979లో లాంగ్‌జంప్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం సాధించడంతోనే అతను భవిష్యత్తులో అద్భుతాలు చేయబోతున్నాడని అర్థమైంది.

19 ఏళ్ల వయసులో 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొనే అమెరికా అథ్లెటిక్స్‌ జట్టులోనే అతనికి చోటు దక్కింది. అయితే ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా అమెరికా ఆ పోటీలను బహిష్కరించడంతో తొలి అవకాశం చేజారింది. 1981లోనే 100 మీట్లర్ల పరుగు, లాంగ్‌జంప్‌లలో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన 1983 వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ అతడిని శిఖరానికి చేర్చింది.

హెల్సింకీలో జరిగిన ఈ పోటీల్లో అతను 3 స్వర్ణాలు సాధించి సత్తా చాటాడు. ఆపై ఇక ఒలింపిక్స్‌లో ఘనతలు అందుకోవడమే మిగిలింది. లాస్‌ ఏంజెలెస్‌ నుంచి మొదలు పెట్టి అట్లాంటా వరకు పుష్కరకాలం పాటు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో లూయీస్‌ శకం సాగింది. 

‘నో టు డ్రగ్స్‌’
అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో ఉత్ప్రేరకాల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించి బహిరంగ వేదికలపై బలంగా వాదించిన అగ్రశ్రేణి ఆటగాళ్లలో కార్ల్‌ లూయీస్‌ ముందు వరుసలో ఉంటాడు. ఆటలో సాధించిన ఘనతలు మాత్రమే కాకుండా ఈ తరహా ఆలోచనలే అతడిని అందరికంటే భిన్నంగా, ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’గా నిలిపాయి. 1987 వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ సమయంలో తన ప్రత్యర్థి బెన్‌ జాన్సన్‌ డ్రగ్స్‌ వాడాడంటూ లూయీస్‌ బహిరంగంగా వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

తాను ఓడిపోయాడు కాబట్టి అలా అంటున్నాడంటూ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఏడాది తర్వాత సియోల్‌ ఒలింపిక్స్‌లో అదే నిజమైంది. 100 మీటర్ల పరుగులో నెగ్గిన జాన్సన్‌ డ్రగ్స్‌ వాడాడని తేలడంతో అతనిపై నిషేధం పడింది. ఈ క్రమంలో తనపై కూడా రాళ్ళదాడి తప్పలేదు. లూయీస్‌ కూడా నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడాడంటూ ఒక నివేదిక బయటకు వచ్చింది.

అయితే లూయీస్‌ ఏమాత్రం బెదరలేదు. సాంకేతికంగా అన్ని అంశాలను ముందుకు తెచ్చి తాను తప్పు చేయలేదని నిరూపించుకున్నాడు. చివరకు డోపింగ్‌ ఏజెన్సీ కూడా లూయీస్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఆ తర్వాత అతనిపై ఈ విషయంలో ఇంకెప్పుడూ విమర్శలు రాలేదు. రిటైర్మెంట్‌ తర్వాత పలు సినిమాలు, టీవీ సిరీస్‌లలో లూయీస్‌ నటించాడు.

2011 అమెరికా పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు అతను ప్రయత్నించాడు. డెమోక్రటిక్‌ తరఫున న్యూజెర్సీ సెనేట్‌ స్థానం నుంచి బరిలోకి దిగినా, సాంకేతిక కారణాలతో అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది. స్వల్పకాలం పాటు తాను చదివిన హూస్టన్‌  యూనివర్సిటీలో అథ్లెటిక్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా కూడా అతను వ్యవహరించాడు. 

ఘనతలివీ...
ఒలింపిక్స్‌లో 9 స్వర్ణ పతకాలు, 1 రజతం 
►(1984 లాస్‌ ఏంజెల్స్‌ – 100 మీ., 200 మీ., లాంగ్‌జంప్, 4*100 మీ. రిలే) 
►(1988 సియోల్‌ – 100 మీ., లాంగ్‌జంప్‌), 200 మీ.లో రజతం
►(1992 బార్సిలోనా – లాంగ్‌ జంప్, 4*100 మీ. రిలే)
►(1996 అట్లాంటా – లాంగ్‌జంప్‌) 
►(1988 సియోల్‌ – 200 మీ.లో రజతం)

►వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో 8 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం (1983, 1987, 1991, 1993లలో కలిపి 8 స్వర్ణాలు), 1991లో ఒక రజతం, 1993లో ఒక కాంస్యం 
స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద సెంచరీ, ఒలింపియన్‌ ఆఫ్‌ ద సెంచరీలతో పాటు పలుమార్లు అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు.
►లాంగ్‌జంప్‌లో పదేళ్ల పాటు ఓటమి లేకుండా వరుసగా 65 పోటీల్లో గెలిచిన రికార్డు.
-∙మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 

చదవండి:  'అతడు ఏదో పెద్ద స్టార్‌ క్రికెటర్‌లా ఫీలవతున్నాడు.. గిల్‌ను చూసి నేర్చుకో'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top