
సౌతాఫ్రికాతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 276 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టాప్-3 ప్లేయర్లు ట్రవిస్ హెడ్ (103 బంతుల్లో 142; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (106 బంతుల్లో 100; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కెమరూన్ గ్రీన్ (55 బంతుల్లో 118 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకాలతో హోరెత్తించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగుల రికార్డు స్కోర్ చేసింది.
అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్ కన్నోలీ (6-0-22-5), జేవియర్ బార్ట్‌లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది.
రెండో వేగవంతమైన సెంచరీ
ఈ మ్యాచ్‌లో ఆసీస్ యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ శివాలెత్తిపోయాడు. మూడో స్థానంలో బరిలోకి దిగి కేవలం 47 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ సెంచరీ వన్డేల్లో ఆసీస్ తరఫున రెండో వేగవంతమైందిగా రికార్డైంది. 2023లో మ్యాక్స్‌వెల్ నెదర్లాండ్స్‌పై చేసిన 40 బంతుల శతకం.. వన్డేల్లో ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా కొనసాగుతుంది.
వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగవంతమైన శతకాలు (టాప్-4)
40 - గ్లెన్ మాక్స్‌వెల్ vs NED, ఢిల్లీ, 2023
47 - కామెరాన్ గ్రీన్ vs SA, మెకే, 2025*
51 - గ్లెన్ మాక్స్‌వెల్ vs SL, సిడ్నీ, 2015
57 - జేమ్స్ ఫాల్క్‌నర్ vs IND, బెంగళూరు, 2013