
రింగ్ రోడ్డు మ్యాప్ సిద్ధం చేయండి
హుస్నాబాద్: రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్లానింగ్ మ్యాప్ సిద్ధం చేయాలని కలెక్టర్ హైమావతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు ఆయా శాఖల అధికారులు అనుమతులు ఇచ్చి టెండర్ విధానం పూర్తి చేయాలన్నారు. రోడ్డుకిరువైపులా చెట్లు తొలగించడం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. అంతకపేటలో 220 కేవీ విద్యుత్ జంక్షన్ కోసం 10 ఎకరాల స్థలం రెడీగా ఉందని విద్యుత్ అధికారులు వెంటనే ఆయా అనుమతులు తీసుకోవాలన్నారు. ఉమ్మాపూర్ గుట్టల వద్ద నిర్మించే ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు రాగానే ఇంజనీరింగ్ అధికారులకు అందిస్తామని తెలిపారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు కాలువల భూ సేకరణ ప్రక్రియ పూర్తవుతోందని తెలిపారు. హుస్నాబాద్ డిగ్రీ కళాశాలలో పీజీ ఎం.కామ్ కోర్సుకు 60 సీట్లు మంజూరు అయ్యాయన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేసేలా ఎంపీడీఓ, మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. 150 పడకల ఆస్పత్రి, కోహెడలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, కాలువల భూ సేకరణ పనుల పై అధికారులతో చర్చించారు.