
ఇళ్లను వేగంగా నిర్మించండి
● మొదట పూర్తి చేసిన వారికిసొంత ఖర్చుతో గృహ ప్రవేశం చేయిస్తా ● రెవెన్యూ డివిజన్ అంశాన్నిసీఎం దృష్టికి తీసుకెళ్తా ● భువనగిరి ఎంపీ చామల
చేర్యాల(సిద్దిపేట): ‘ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలి. మొదట పూర్తి చేసిన వారికి నా సొంత ఖర్చుతో గృహ ప్రవేశం చేయిస్తా’నని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కల్యాణి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండల పరిధిలోని పలు గ్రామాలకు మంజూరైన 636 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను కలెక్టర్ హైమావతి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఇంటి నిర్మాణ ప్రగతి మేరకు పది రోజులకు ఒకసారి బిల్లు చెల్లింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అలాగే ఈ నెల 14న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన రైతుల భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భూమి సమస్యలున్న రైతులు వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ అంశాన్ని సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి డివిజన్ ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్‌రావు, ఆర్డీవో సదానందం, జెడ్పీ సీఈఓ రమేష్, ప్రత్యేక అధికారి, ఏడి గ్రౌండ్ వాటర్ నాగరాజు, నాలుగు మండలాల లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.