
నిధులున్నా.. పనులు సున్నా
అధ్వానంగా అంతర్గత రోడ్లు
● 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.2కోట్ల అంచనా వ్యయం ● వానాకాలం కావడంతోదారులన్నీ చిత్తడి ● గజ్వేల్ మున్సిపాలిటీ దుస్థితి
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలో 80కిలోమీటర్ల పొడవున అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడానికి సుమారుగా రూ.120 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదించారు. కానీ ఇందులో కేవలం రూ. 22.87కోట్లను మాత్రమే మూడేళ్ల కిందట ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితంగా 18కిలోమీటర్ల మేర మాత్రమే పనులు చేపట్టాల్సి ఉండగా.. 70ఽశాతం మేర చేపట్టి మిగితావి వదిలేశారు. గత మున్సిపల్ పాలకవర్గంలోని సభ్యులు తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యతినివ్వడం, తరుచూ గొడవలు పడటం పరిపాటిగా ఉండేది. ఈ పరిస్థితి అభివృద్ధికి అవరోధంగా మారింది. చివరకు పాలకవర్గం తమ పదవీ కాలం ముగిసే సమయంలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేని సీసీ రోడ్ల నిర్మాణానికి గతేడాది ఆగస్టు నెలలో రూ.2కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులను ప్రతిపాదించి తీర్మానించింది. మొత్తంగా 20పనులు చేపట్టాలని నిర్ణయించి ఒక్కో పనికి రూ.10లక్షలు మంజూరు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ఒక్కో వార్డు ఒక్కో పని కేటాయించారు. ఇందులో 11, 12, 14, 15, 19వార్డుల్లో పనులు పూర్తి చేసి, మిగిలిన 15 వార్డుల్లో పనులు పెండింగ్‌లో పెట్టారు. ఫలితంగా ఆయా వార్డుల్లో ప్రస్తుత వర్షాకాలంలో తేలికపాటి జల్లులు కురిసినా అంతర్గత రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు నరకం చూపుతున్నాయి. ప్రత్యేకించి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీప్రసన్న నగర్, గజ్వేల్‌లోని పాత పట్టణం, ప్రజ్ఞాపూర్‌లోని పలు కాలనీల్లో పరిస్థితి దయనీయంగా ఉన్నది.
విలీన గ్రామాల్లోనూ అదే దుస్థితి
మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. వర్షం వస్తే ఆయా కాలనీల్లో కనీసం నడవలేని స్థితిలో అంతర్గతర రోడ్లు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆయా కాలనీవాసులు మున్సిపల్ యంత్రాంగానికి తరుచూ విన్నపాలు చేస్తున్నా..పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికీ ఈ పనులపై స్పందించి ప్రారంభమయ్యేలా చొరవ చూపకపోతే ప్రజల ఇబ్బందులు తీరే అవకాశం లేదు.
మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీప్రసన్ననగర్‌లో అంతర్గత రోడ్డు దుస్థితి
పనులు ప్రారంభిస్తాం
మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన సీసీ రోడ్ల పనులు పెండింగ్‌పై పరిశీలన జరుపుతాం. వాటిని ప్రారంభించేలా చూస్తాం. ప్రజల ఇక్కట్లు తీర్చడమే లక్ష్యంగా ముందుకుసాగుతాం.
– బాలకృష్ణ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌మున్సిపల్ కమిషనర్