
కొలువుదీరిన నాచగిరి పాలకవర్గం
● చైర్మన్‌గా రవీందర్‌గుప్తా ఏకగ్రీవం ● ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లాలో సుప్రసిద్ధమైన నాచారం గుట్ట లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శుక్రవారం నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. నాచగిరి ఆలయ ముఖమండపంలో ధర్మకర్తల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ధర్మకర్తలుగా జగ్గయ్యగారి శేఖర్‌గుప్తా, దేశపతి ఉషశ్రీ, గాల కిష్టయ్య, కర్రె పద్మ, జగ్గన్నగారి సురేందర్‌రెడ్డి, జే.ఎస్ తిరుమల్‌రావు, రుద్ర శ్రీహరి, కొత్తపల్లి శ్రీనివాస్, చందా నాగరాజుగుప్తాతోపాటు, ఎక్స్‌అఫీషి యో మెంబర్‌గా జగన్నాథాచార్యులుతో ఆలయ సహాయ కమిషనర్ విజయరామారావు, ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మిలు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల ఏకగ్రీవ ఆమోదంతో పల్లెర్ల రవీందర్‌గుప్తా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నూతన చైర్మన్‌ను మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అభినందిస్తూ సన్మానించారు. చైర్మన్, పాలకమండలి ధర్మకర్తలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, విజయమోహన్, శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి తదితరులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా శనివారం నాచగిరి ఆలయ పాలకమండలి సమావేశం, సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు.