
ఆగి.. సాగిన పొగాకు వేలం
కనిగిరి రూరల్: ధరల దోబూచులాటలో పొగాకు రైతులు విలవిల్లాడుతున్నారు. గురువారం కనిగిరి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన కాసేపటికే వేలం నిలిచిపోయింది. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేలాన్ని బహిష్కరించారు. అలవలపాడు క్లస్టర్ పరిధిలోని 7 గ్రామాల నుంచి సుమారు 403 పొగాకు బేళ్లను రైతులు తీసుకొచ్చారు. వేలంలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు, బయ్యర్లు ఒకటీరెండు బేళ్లకు కేజీ రూ.280 ధర ఇచ్చి.. మిగిలిన వాటిని రూ.240 చెల్లిస్తూ వచ్చారు. సుమారు 50 బేళ్లకు ఇదే ధర కొనసాగడం రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఎఫ్1, ఎఫ్2 మంచి రకం బేళ్లకు కూడా రూ.230, రూ.240కి మించి ధర ఇవ్వక పోవడంతో రైతులు మూకుమ్మడిగా వేలాన్ని నిలిపేశారు. బయ్యర్లు, కంపెనీల ప్రతినిధులు కుమ్మకై ్క.. ధర లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరుణంలో రైతులు, కంపెనీ బయ్యర్లతో బోర్డు అధికారులు సమావేశం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం ఆగిన పొగాకు వేలం బోర్డు అధికారుల బుజ్జగింపులతో మధ్యాహ్నం తర్వాత మళ్లీ కొనసాగింది. మొత్తం 403 బేళ్లకుగాను 51 బేళ్లు నోబిడ్ కింద నిలవగా, మిగతా వాటిని కొనుగోలు చేశారు. గరిష్ట ధర కేజీ రూ.280, కనిష్ట ధర రూ.200, సరాసరి ధర రూ.230 పలికిందని వేలం నిర్వహణాధికారి కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 9 కంపెనీల ప్రతినిధులు వేలం కేంద్రం వద్దకు వచ్చినా.. మూడు కంపెనీలు మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన 353 బేళ్లలో గరిష్ట ధర పలికినవి 25కు మించి లేవని రైతులు పెదవి విరిచారు. పొగాకుకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని రైతు సంఘం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గిట్టుబాటు ధర లేదని వేలాన్ని
బహిష్కరించిన రైతులు
సర్దిచెప్పి మధ్యాహ్నం తర్వాత కొనసాగించిన బోర్డు అధికారులు
అయినా సరైన ధర ఇవ్వకపోవడంపై
రైతుల తీవ్ర ఆగ్రహం
వేలంలో అరకొరగా పాల్గొన్న కంపెనీల
ప్రతినిధులు
పొగాకు రైతుల గోడు పట్టదా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై
ఏపీ రైతు సంఘం ఆగ్రహం
ఒంగోలు టౌన్: వ్యాపారుల తీరుతో కష్టనష్టాలు చవిచూస్తున్న పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి. హనుమారెడ్డి, కె.వీరారెడ్డి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో విమర్శించారు. మిర్చి పంట సాగు చేసి తెగుళ్ల వల్ల సరైన దిగుబడి రాక, ధర లేక నష్టపోయిన రైతులు.. ప్రత్యామ్నాయ పంటగా బర్లీ, వర్జీనియా పొగాకు పండించారని తెలిపారు. క్వింటాకు 15 వేల రుపాయలు తక్కువ కాకుండా తీసుకుంటామని చెప్పిన పొగాకు కంపెనీల ప్రతినిధులు తీరా పంట చేతికొచ్చాక మొహం చాటేయడం దారుణమని మండిపడ్డారు. తీవ్ర ఆందోళనకు గురైన రైతులు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధ తట్టుకోలేక ఇప్పటికే ఇద్దరు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ఇప్పటికీ ప్రారంభించకపోవడం సరికాదని, రోజుకు రెండుమూడొందల బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయని, పచ్చ మాడును పూర్తిగా కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. మేలు రకం పొగాకుకు సరైన ధర ఇవ్వకపోతున్నా టుబాకో బోర్డు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. జిల్లా ప్రజాప్రతినిధులు తూతూ మంత్రంగా సమావేశాలతో సరిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షభంలోకి కూరుకుపోవడంతో 18 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. గత చేదు అనుభవాలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేలుకోవాలని, తక్షణమే ప్రభుత్వరంగ సంస్థలను రంగంలోకి దింపి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆగి.. సాగిన పొగాకు వేలం