
రెండు ఎంపీయూపీ పాఠశాలలను యథావిధిగా ఉంచండి
● డీగ్రేడ్ చేయవద్దంటూ హైకోర్టు స్టేటస్ కో
సీఎస్‌పురం(పామూరు): సీఎస్‌పురం మండలంలోని కోవిలంపాడు, పెదగోగులపల్లె ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను డీగ్రేడ్ చేయకుండా ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయా పాఠశాలలను డీగ్రేడ్ చేయవద్దంటూ ఎస్‌ఎంసీ చైర్మన్లు, గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జూన్ 27న విచారణ ఉన్నందున అంతవరకు రెండు పాఠశాలలను డీగ్రేడ్ చేయకుండా యథావిధిగా కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కురిచేడు: రైలు దూసుకొస్తున్న సమయంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ్చఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కాటంవారిపల్లె గ్రామానికి చెందిన సంగు రమణారెడ్డి(55) గురువారం వేకువ జామున పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొంది. నరసరావుపేట రైల్వే ఎస్సై శ్రీనివాసనాయక్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రమణారెడ్డి మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చెక్ బౌన్స్ కేసులో
నిందితుడికి ఏడాది జైలు
గిద్దలూరు రూరల్: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు పరిహారం కింద రూ.లక్ష చెల్లించాలని గిద్దలూరు అడిషనల్ జ్యుడీషియల్ సివిల్ జడ్జి కె.భరత్‌చంద్ర గురువారం తీర్పునిచ్చారు. జె.పంగులూరు మండలానికి చెందిన ఎన్.ఎన్ స్మార్ట్ టెక్నాలజీ ప్రొప్రైటర్ నాగార్జున కంభంకు చెందిన ఎస్.శ్రీనివాసులు వద్ద ఏడేళ్ల క్రితం రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. బాకీ చెల్లింపు నిమిత్తం ఇచ్చిన చెక్కును శ్రీనివాసులు బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అయింది. దీంతో నాగార్జునపై కోర్టులో కేసు వేయడంతో తుది విచారణ చేపట్టిన జడ్జి పైన పేర్కొన్న విధంగా తీర్పు వెల్లడించారు.
పిచ్చికుక్క స్వైర విహారం
● ఇద్దరు చిన్నారులకు గాయాలు
తాళ్లూరు: పిచ్చికుక్క స్వైర విహారం చేసి పలువురిని గాయపరిచిన సంఘటన తాళ్లూరు మండలం మాధవరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సాయి అనే బాలుడి తల, గొంతు వద్ద పిచ్చికుక్క కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలక్ష్మి అనే బాలికను పిచ్చికుక్క కరుస్తున్న సమయంలో పక్కనే ఉన్న స్థానికులు కేకలు వేసి తరిమికొట్టడంతో పారిపోయింది. క్షతగాత్రులను తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. సాయి తీవ్రంగా గాయపడటంతో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.