
నీటి ముల్లు..!
పురం గొంతులో
పశ్చిమ ప్రకాశానికి ముఖ ద్వారం మార్కాపురం. అక్కడ బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు పట్టణవాసులు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం వెరసి ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వారం రోజులకోసారి సాగర్ నీటిని ప్రజలకు అందిస్తుండడంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. దూపాడు ఎస్‌ఎస్ ట్యాంకులో నీళ్లున్నా అందించలేని దుస్థితి. సుమారు లక్ష జనాభా ఉన్న పట్టణంలో అధికారుల మధ్య సమన్వయలోపం నీటి సమస్య తీవ్రరూపానికి కారణంగా మారుతోంది.
మార్కాపురం టౌన్:
పట్టణ ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి రాజీవ్ నగరబాటలో భాగంగా మార్కాపురం పర్యటనకు వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ఆయన రూ.45 కోట్లు మంజూరు చేశారు. దీంతో దూపాడు వద్ద నుంచి సుమారు 28 కిలోమీటర్ల మేర మార్కాపురానికి పైపులైన్లు ఏర్పాటు చేసి సాగర్ నీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. 2,200 మిలియన్ లీటర్ల కెపాసిటీతో దూపాడు వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. నాటి నుంచి ప్రజలకు సాగర్‌నీటిని అందిస్తుండటంతో ఇబ్బందిలేకుండా కొనసాగింది. ప్రస్తుతం పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. వారి అవసరాలకు సరిపడా నీటిని అందించలేకపోతున్నారు. అయితే, దూపాడు నుంచి కేశినేనిపల్లి వరకూ సుమారు 3 కిలోమీటర్ల మేర జీఆర్‌పీ పైపులైను తరచూ మరమ్మతులకు గురికావడంతో ప్రజలకు నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. పైపులైన్లు పగిలితే ప్రజలకు నరకమే. గతంలో నాలుగు రోజులకొకసారి నీటిని అందించేవారు. ప్రస్తుతం వారానికొకసారి అందించడం కూడా గగనంగా మారింది. పైపులైన్లు మరమ్మతులకు గురైతే మరో మూడు రోజులు అదనంగా సమయం పడుతోంది. ఇదే అదునుగా నీటి వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ట్యాంకర్ నీటిని రూ.500 వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉంటే మరో రూ.200 అదనంగా తీసుకుంటున్నారు.
6 రోజులకొకసారి సాగర్ నీటి సరఫరా పైపులైన్లు పాడైతే నరకమే అడుగంటిన డీప్ బోర్లు శివారు కాలనీల్లో నీటి సమస్యలు ఎస్‌ఎస్ ట్యాంకులో నీరున్నా.. ప్రజలకు తప్పని నీటి కష్టాలు
శివారు ప్రాంతాల్లో నీటి కష్టాలు...
మార్కాపురం పట్టణంలోని శివారు ప్రాంతాలైన రాజ్యలక్ష్మినగర్, చెన్నకేశవనగర్, బాపూజీకాలనీ, పూలసుబ్బయ్యకాలనీ, కొండారెడ్డికాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎస్సీ, బీసీకాలనీ, సుందరయ్యకాలనీ, ఎస్టేట్, డ్రైవర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న డీప్‌బోర్లలో కొన్ని అడుగంటిపోవడంతో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా నీరు వచ్చే డీప్‌బోర్ల వద్ద నీటిని పట్టుకుని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో సుమారు 185 వరకూ డీప్‌బోర్లు ఉన్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతూ వస్తున్నాయి. 180 బోర్లలో నీరు పూర్తి స్థాయిలో రావడంలేదు. బోర్లు ఎండిపోయిన ప్రాంతాలకు మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అవి కూడా సక్రమంగా రాకపోవడంతో బిందెనీటిని రూ.పదికి కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

నీటి ముల్లు..!