‘టీడీపీ అభిమానులు కూడా ఛీ అంటున్నారు’ | KSR Comment On TDP Fans About Party Worst Ruling | Sakshi
Sakshi News home page

‘టీడీపీ అభిమానులు కూడా ఛీ అంటున్నారు’

Oct 8 2024 1:26 PM | Updated on Oct 8 2024 1:37 PM

KSR Comment On TDP Fans About Party Worst Ruling

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఈ విషయం ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ చెప్పాల్సిన అవసరమూ లేదు. అధికార తెలుగుదేశం పార్టీ వారే నిర్మొహమాటంగా ప్రకటిస్తున్నారు. కొంతమంది టీడీపీ నేతలు ప్రస్తుత పరిణామాల గురించి లోలోపల మథనపడుతూంటే కొందరు మాత్రం బహిరంగంగా తమ అసంతృప్తిని, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వీరాభిమాని, సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే ఓ వ్యక్తి పెట్టిన పోస్టు చూసిన ఇతరులు వాస్తవాలు మాట్లాడారని కొనియాడుతున్నారు. ఆ టీడీపీ వీరాభిమాని పేరు ప్రస్తావించడం సబబు కాదు కానీ... ఆయన అన్నమాటలు మాత్రం పరిశీలించదగ్గవి. ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5200 రోజులలో వరస్ట్ వంద రోజుల పరిపాలన (చెత్త పాలన), గత మూడున్నర నెలలలో చూశాం’’ అని కుండబద్దలు  కొట్టారు. 

జపాన్‌కు చెందిన మాకీ అనే సంస్థ 2014-2019 టర్మ్‌లో ఏపీలో చెత్తపాలన సాగుతోందని ఏకంగా కేంద్రానికే ఫిర్యాదు చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలిక్కడ. అప్పట్లో ఈ మాకీ సంస్థే అమరావతికి డిజైన్లు ఇచ్చింది. తరువాతి కాలంలో టీడీపీ ప్రభుత్వంతో వేగలేక వెనకు వెళ్లిపోయారు. ఆ టర్మ్‌లో పాలన చెత్తగా తయారైంది అనేందుకు మూడేళ్ల సమయం పడితే.. ఈ సారి మూడున్నర నెలల్లోనే టీడీపీ అభిమాని స్వయంగా చెత్తపాలన అని కామెంట్‌ చేసే స్థాయికి పాలన దిగజారిందన్నమాట.  వీరి మాట ఇలా ఉంటే... నిత్యం టీడీపీకి భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కూడా ఒకపక్క బాబును కొంత పొగుడుతూనే ఇంకోవపక్క వాస్తవ పరిస్థితుల గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముందుగా టీడీపీ వీరాభిమానుల ఫీలింగ్ ఏమిటో చూద్దాం. ‘‘మీరు చేస్తున్న తప్పులను కవర్ చేయలేకపోతున్నాం.. అడ్మినిస్ట్రేషన్‌లో తోపు, తురుము అని ఇప్పటిదాకా మీకు బిల్డప్ ఇచ్చాం..మీరు అడ్మినిస్ట్రేషన్‌లో  ఫెయిల్ అవుతున్నారు" అని వారు  స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబుకు బిల్డప్ ఇచ్చామని నిజాయితీగా ఒప్పుకున్నారనుకోవాలి. అంటే   అసలు సరుకు ఏమిటో ఇప్పుడు అర్థం అవుతున్నదనేగా అర్థం? బాబు చెత్త పాలనకు ఉదాహరణగా ఆ టీడీపీ వీరాభిమాని ఇసుక సమస్యను  ప్రస్తావించారు. ‘‘జగన్ టైమ్ లోనే ఇసుక చౌకగా దొరికిందన్నది పబ్లిక్ టాక్ అని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చెబుతున్నారు. 

ఒక సంవత్సరంపాటు టీడీపీ నేతలకు ఇసుక మీద దోచుకోండని లైసెన్స్ ఇచ్చారా’’ అని ఆయన ప్రశ్నించారు. ఏదో తప్పు జరుగుతోందని అంటూ, దీనిపై చంద్రబాబు, లోకేష్ లు కూర్చుని సమీక్షించుకోవాలని సలహా కూడా ఇచ్చారు. కానీ ఈ సలహాను వినే పరిస్థితి ఇప్పుడుందా? సందేహమే! పైగా ఈ వ్యాఖ్య చేసిన టీడీపీ వీరాభిమాని సంగతి చూడాలని ఆదేశాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు నడుస్తున్నది దేశ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరిపైన అయినా కేసులు పెట్టవచ్చు. ఎవరినైనా వేధించవచ్చు. తమ వారిపై ఎలాంటి కేసులు ఉన్నా ఎత్తి వేసుకోవచ్చు. చివరికి ఐపిఎస్ లను కూడా తమ ఇష్టం వచ్చినట్లు సస్పెండ్ చేయవచ్చు.

టీడీపీ అభిమానులు, కార్యకర్తలలో ఉన్న ఈ భావాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కొంతైనా కవర్ చేయక తప్పడం లేదు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు  అంతు ఉండడం లేదు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. టీడీపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇసుక.మద్యం దందాలలో ఎమ్మెల్యే భాగస్వామి అవుతున్నారని వారు చెబుతున్నారు.ఆ విషయాన్ని ధృవీకరిస్తూ ఎల్లో మీడియా కూడా కథనాలు రాయక తప్పడం లేదు. ఈనాడులో మద్యం దందాపై ఒక కథనం వచ్చింది. దాని ప్రకారం అన్ని జిల్లాలలో పలువురు ఎమ్మెల్యేలు మద్యం టెండర్లు వేరే వారు వేయనివ్వకుండా అడ్డుపడుతున్నారట. దాంతో మద్యం షాపుల టెండర్లకు అప్లికేషన్ లు కేవలం ఎనిమిదివేల పైచిలుకు మాత్రమే వచ్చాయి. ఏపీలో 3400 షాపులు ఉంటే, తెలంగాణలో 2600 షాపులకే లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 

ఎమ్మెల్యేల అక్రమాలపై ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది. ఈ మీడియా లక్ష్యం చంద్రబాబుకు చెడ్డపేరు రాకుండా ఎమ్మెల్యేలపై నెపం నెట్టేసి విషయాన్ని దారి మళ్లించాలని కూడా కావచ్చు. ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా బ్లాక్ మెయిలింగ్ లో భాగంగా కూడా రాస్తుండవచ్చు. సాక్షి మీడియాలో చంద్రబాబు ప్రభుత్వంలోని అకృత్యాలు, స్కామ్ లపై ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అవేమీ లేవని దబాయిస్తుంటారు. కానీ ఇప్పుడు వారి పత్రికలలో ఆ తరహా కథనాలు వస్తున్నాయి. 

ఇక రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు అందరిని కలవర పరుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఒక మైనర్ బాలికపై రేప్ జరిగితే అది జాతీయ పత్రికలలో ప్రధాన కథనం అయింది. ఏపీలో అలాంటివి పది జరిగినా, ప్రజలందరికి తెలియకుండా కప్పి పెడుతూ మేనేజ్ చేస్తున్నారు. మరో వైపు కూటమి చేసిన వాగ్దానాలు ఒకటి,అరా తప్ప మిగిలిన వాటిని నెరవేర్చడం లేదు. దానిపై ప్రజలలో తీవ్ర  వ్యతిరేకత వస్తోంది. విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడంలో పెద్ద స్కామ్ లు జరిగినట్లు సీపీఎం నేత బాబూరావు వెల్లడించారు. కేవలం అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకే రూ. 23 కోట్ల వ్యయం అయినట్లు  లెక్కలు రాశారట. 

పది రోజులు జనం సరిగా భోజనం అందక నానాపాట్లు  పడితే ప్లేట్ ఒక్కటికి రూ.264 వెచ్చించినట్లు ప్రభుత్వం లెక్కలు రాసిందట. ఇలా ఒకటి కాదు..అన్ని రంగాలలోను చంద్రబాబు  ప్రభుత్వం వైఫల్యం చెందడం, జరుగుతున్న స్కామ్ లతో  టిడిపి కార్యకర్తలు, అభిమానులలో తీవ్ర నిర్వేదం కలిగిస్తోంది. అసలు చంద్రబాబు పాలన ఏమీ లేదని, ఆయన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని, మొత్తం నిర్ణయాలన్ని లోకేషే ,ఆయన సన్నిహితులు   తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. 

ఇవన్ని చూశాక ఒక విషయం అర్థం అవుతుంది. అదేమిటంటే మాజీ సీఎం జగన్ చెబుతున్నవి పచ్చి నిజాలూ అని. కొద్ది రోజుల క్రితం జగన్ ఒక వ్యాఖ్య చేశారు.  'కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు.ఫీజ్  రీయింబర్స్  మెంట్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, అమ్మ ఒడి, రైతు భరోసా, స్కూళ్లు, ఆస్పత్రులు అభివృద్ది అన్నీ పోయాయి. మూడున్నర నెల్లో లక్షన్నర పించన్లు తగ్గించారు.నాణ్యమైన చదువులు లేవు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందడం లేదు. ఆర్బికెలలో సేవలు లేవు.ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్  లేదు.

అన్ని విషయాలలో ఈ ప్రభుత్వం విఫలం అయింది.చంద్రబాబు అబద్దాలు, మోసాల పట్ల ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంంది.ప్రజల కోపాగ్నిలో కూటమి ప్రభుత్వం దహించుకుపోవడం ఖాయం" అని అభిప్రాయపడ్డారు. బహుశా ఈ డెబ్బై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా  ఏపీలో ప్రస్తుతం అరాచక, అధ్వాన్న పాలన సాగుతున్నదన్నది వాస్తవం. దానిని టీడీపీ అభిమానులే సోషల్ మీడియాలో అంగీకరిస్తున్నారు. ఏపీ ప్రజలకు ఈ పరిస్థితి నుంచి ఎప్పటికి విముక్తి కలుగుతుందో!


- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement