
టీడీపీ విదిలించే 15 సీట్లతో జనసేనకేమిటి లాభమన్న..
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవో కొన్ని సీట్లకు కక్కుర్తిపడటం, కాపులను వేధించి, అవినీతిలో కూరుకుపోయిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తలవంపుల పని అని వారు భావిస్తున్నారు. ఎవరైనా పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలనుకుంటారని, కానీ జనసేనకు తెలుగుదేశం పార్టీ విదిలించే పదిహేను సీట్లతో ఏమి సాధించగలమని జనసైనికులు అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ పవన్ కోరుతున్నట్లుగా 25 సీట్లు ఇచ్చినా, పవన్ సీఎం ఎట్లా అవుతారని నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ కారణాలతోనే ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన పవన్ వారాహి బహిరంగ సభకు జనసేన కార్యకర్తలు అతి తక్కువగా హాజరయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబుతో పొత్తును అధికశాతం జన సైనికులు వ్యతిరేకిస్తారని, పార్టీకి తీరని నష్టమని జనసేన పార్టీలోని ఓ వర్గం మొదటి నుంచీ చెబుతోంది. ఇప్పుడు అదే నిజమైందని అంటున్నారు.
టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత తొలిసారిగా పవన్ వారాహి సభ అవనిగడ్డలో జరిగింది. ఈ వారాహి యాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలంటూ బాలకృష్ణ, ఇతర టీడీపీ నేతలు పిలుపునిచ్చినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. గత మూడు విడతల వారాహి యాత్రలకంటే చాలా తక్కువగా అవనిగడ్డలో జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారని, వారి అసంతృప్తిని ఇది తేటతెల్లం చేస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇది కచ్చితంగా ప్యాకేజీనే అంటున్న పార్టీ నేతలు
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన అనంతరం పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ ప్రకటన పట్ల అప్పట్లోనే జనసేన పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. జనసేనకు తెలుగుదేశం పార్టీ 15 సీట్లు ఇస్తామని చెప్పినట్లుగా పార్టీలో చర్చ జరిగింది. అయితే, పవన్ అడుగుతున్నదే 25 సీట్లు అని, వాటికీ టీడీపీ అంగీకరించడంలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి, ఆ పార్టీ నేత ముఖ్యమంత్రి కావాలంటే మెజారిటీ సీట్లను గెల్చుకోవాలి. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో పవన్ సీఎం కావాలంటే కనీసం 88 సీట్లలో విజయం సాధించాలి. కానీ టీడీపీ విదిలించే 15 సీట్లతో జనసేనకేమిటి లాభమన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ విషయం పార్టీ పెద్దలకు కూడా తెలిసినప్పటికీ, టీడీపీతో పొత్తుకు అంగీకరించారంటే ఇది కచ్చితంగా ప్యాకేజీయేనని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. దీంతో కార్యకర్తల్లోనూ పార్టీ పట్ల, నాయకుని పట్ల నిరాసక్తత ఏర్పడింది.
కాపు ఉద్యమంపై చంద్రబాబు ఉక్కుపాదమూ కారణమే?
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. కాపు సామాజిక వర్గం నేతలు, వారి కుటుంబాల పట్ల అమానుషంగా వ్యవహరించింది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంశంలో పవన్ తగిన స్థాయిలో స్పందించకపోయినా, సొంత సామాజికవర్గం నాయకుడిగా వారు జనసేనకు మద్దతిచ్చారు. అయితే, కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని చంద్రబాబు సర్కారు అణచివేయడం, ఉద్యమంలో పాల్గొన్న తమ వర్గం నేతలను అవమానించిన తీరును వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
వీటన్నింటినీ పట్టించుకోకుండా.. ఇప్పుడు అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు పవన్ మద్దతు తెలపడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబుకు, టీడీపీకి మద్దతుగా పవన్ ప్రకటనలు చేసిన ప్రతిసారీ ఆ సామాజికవర్గంలోనే పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అవనిగడ్డలో పవన్ సభ విఫలమవడానికి ఇదీ ఒక కారణమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీజేపీతో పొత్తుకు మంగళమేనా?
అవనిగడ్డ సభలో పవన్ కేవలం తెలుగుదేశం పార్టీ పొత్తు అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. గత మూడున్నరేళ్లుగా బీజేపీతో ఉన్న పొత్తుపై ఒక్క మాటా మాట్లాడపోవడం జనసేనలోనే పెద్ద చర్చకు దారితీసింది. బీజేపీతో పొత్తుకు పవన్ మంగళం పాడినట్లేనని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గత నెల 14న రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి బయటకు వచ్చాక అప్పటికప్పుడే టీడీపీతో పొత్తుపై పవన్ ప్రకటన చేశారు.
బీజేపీ కలిసి వచ్చినా, రాకపోయినా టీడీపీ, జనసేన పొత్తు మాత్రం కొనసాగుతుందని ప్రకటించారు. ఆ తర్వాత మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో పొత్తు ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ పెద్దలకు వివరిస్తానని చెప్పారు. అయితే, ఇప్పటికీ పవన్ ఢిల్లీ వెళ్లలేదు. బీజేపీ జాతీయ పెద్దలను కలవలేదు. ఇప్పుడు అవనిగడ్డ సభలో బీజేపీ ప్రస్తావన లేకుండా టీడీపీ పొత్తుపైనే పవన్ మాట్లాడడం ద్వారా పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు జనసేనలో చర్చ సాగుతోంది.