కల్వకుండా చేసే కుటుంబమది!: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On KCR, KTR | Sakshi
Sakshi News home page

కల్వకుండా చేసే కుటుంబమది!: సీఎం రేవంత్‌

Sep 1 2025 6:00 AM | Updated on Sep 1 2025 6:00 AM

CM Revanth Reddy Comments On KCR, KTR

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ దుఃఖంతో ఉన్నారని గంగుల చెప్పకనే చెప్పారు

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా గవర్నర్‌తో మాజీ ఆర్థిక మంత్రి లాబీయింగ్‌  

రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతోనే బీసీ కులగణనకు డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు 

కేసీఆర్‌ తెచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్ట సవరణలే గుదిబండ 

మున్సిపల్‌ చట్టసవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాలు సుహృద్భావంతో కలిసిపోకుండా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించటం కల్వకుంట్ల కుటుంబానికి ఇష్టంలేదని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేసేందుకు ప్రతిపాదించిన మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో బీఆర్‌ఎస్‌ సభ్యుడు గంగుల కమలాకర్‌ చేసిన విమర్శలకు సీఎం రేవంత్‌ ఘాటుగా సమాధానమిచ్చారు. 

‘అది కల్వకుంట్ల కాదు.. ఎవరినీ కల్వకుండ చూసే కుటుంబం. బీసీలు, ఓసీలు కలవొద్దు.. ఎస్సీలు, ఎస్టీలు కలవొద్దు.. హిందువులు, ముస్లింలు కలవకుండా చూసే కుటుంబం అది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి వరుసలో తాను ఉంటానని గంగుల కమలాకర్‌ అన్నారు. కానీ వాళ్ల నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సంతోషంగా ఉంటారని చెప్పలేదు. వాళ్ల నాయకులు కడుపునిండా విషం పెట్టుకుని ఉన్నారని చెప్పకనే చెప్పారు’అని దుయ్యబట్టారు.  

చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. 
హైకోర్టు ఆదేశాలను అనుసరించే రాష్ట్రంలో కుల గణన నిర్వహించామని సీఎం తెలిపారు. ‘బీసీల గణన బాధ్యతను తొలుత రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించగా, డెడికేటెడ్‌ కమిషన్‌ ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.క్రిష్ణయ్య హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ విచారించిన హైకోర్టు డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరుక్షణమే డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి కుల గణన నిర్వహించాం. 

ఎలాంటి అడ్డంకులు రాకూడదనే అధికారుల కమిటీని, మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపి సమాచారాన్ని సేకరించాం. న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన తరువాతనే డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించాం. ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4న పూర్తిచేశాం. 365 రోజుల్లోనే పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. 

మంత్రివర్గ తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని.. విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్‌కు పంపించాం. గవర్నర్‌ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు. 5 నెలలుగా ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. సెపె్టంబర్‌ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది’అని సీఎం గుర్తు చేశారు. 
 
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా లాబీయింగ్‌  
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని గత ప్రభుత్వం 2018, 2019లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాలు గుదిబండగా మారాయి. అందుకే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్‌కు పంపించాం. ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ఆయన (గవర్నర్‌) ఆర్థిక మంత్రి. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి (ఈటల రాజేందర్‌)గా పనిచేసిన ఆయనతో మితృత్వం ఉంది. 

రాష్ట్రపతికి పంపించాలని తెరవెనుక లాబీయింగ్‌ చేస్తే ఈ ఆర్డినెన్స్‌ కూడా రాష్ట్రపతి వద్దకు పోయింది. ఆర్డినెన్స్‌ ఆమోదం పొందలేదు కాబట్టి అత్యవసరంగా ఆ బిల్లును సభలో ఆమోదించుకుందాం అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ కమిషన్‌కు ఇచ్చిన జీఓనైనా, డెడికేటెడ్‌ కమిషన్‌కు ఇచ్చిన జీఓనైనాం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్షతోనే ఇచ్చాం’అని సీఎం స్పష్టం చేశారు.  

ఐదుసార్లు కోరినా ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు.. 
పెండింగ్‌ బిల్లులపై సంప్రదించేందుకు ఐదుసార్లు ప్రధానికి లేఖ రాసినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకే ప్రధాని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు, గంగలు కమలాకర్‌ అటువైపు కన్నెత్తి చూడలేదని.. అంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ల పార్టీ నాయకుడు సిద్ధంగా లేరని అర్థమవుతోందని ఆరోపించారు.

బీజేపీ సభ్యుడు పాయల్‌ శంకర్‌ తన పలుకుబడితో ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరారు. ‘రాహుల్‌గాంధీ ధర్నాకు రాలేదని గంగుల అన్నారు. రాహుల్‌గాంధీ చెప్పకపోతే ఇంత ముఖ్యమైన పని నేను చేస్తానా? రాహుల్‌గాం«దీకి తెలియకుండా ఏదీ చేయను. వందేళ్లుగా చేయని పనిని మేం చేస్తే.. కేసీఆర్‌ సభకు వచ్చి మమ్మల్ని అభినందించి ఉంటే పెద్దరికం పెరిగి ఉండేది. వారేమో రారుం..వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు’అని సీఎం మండిపడ్డారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement