
ఇల్లందకుంట (హుజూరాబాద్): అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి మారుపేరుగా మారిందని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, బుజూనూర్, సీతంపేట, మర్రివానిపల్లి, సిరిసేడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్, రేషన్ కార్డులు రావని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యంలో 29 రూపాయల ఖర్చు కేంద్రం భరిస్తే కేవలం రెండు రూపాయలు రాష్ట్రం భరిస్తోందన్నారు. తాను హరీశ్‌లా ఆరు అడుగులు లేకపోవచ్చు కానీ తెలివిలో ఆయన కంటే ఒక ఆకు ఎక్కువేనని పేర్కొన్నారు. హుజూరాబాద్ నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమైందని, రానున్న రోజుల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంచేశారు. తాను బీజేపీలో ఉండనని, వేరే పార్టీలోకి వెళ్లిపోతానని టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, నిజానికి రానున్నరోజుల్లో ఆ పార్టీయే కనుమరుగవుతుందన్నారు.