
ర్యాలీలో మాట్లాడుతున్న బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రాష్ట్రంలో ఏ మసీదు పునాదులైనా తవ్వుదాం. శవాలు బయటపడితే మీరు తీసుకోండి. శివలింగాలు బయటపడితే మేం తీసుకుంటాం’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. 36 వేల ఆలయాలు కూల్చిన ఈ రాజ్యంలో హిందువులు దీనావస్థలో ఉన్నారని.. ఈ రోజు దేశంలో ఏ మసీదు తవ్వినా ఆలయాలు, శివలింగాలే బయటపడుతున్నాయని అన్నారు. బుధవారం కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న సంజయ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరంభం నుంచే ఉద్వేగంగా ప్రసంగించారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే అధికార భాషగా ఉర్దూను రద్దు చేస్తామని, ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న మదర్సాలను నిషేధిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాషాయీకరణ చేస్తున్నామని, రాష్ట్రానికి పట్టిన శనిని కాషాయంతో తుడిచేస్తామని చెప్పారు. లవ్‌జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను వంచించే వారికి లాఠీల రుచి చూపెడతామని, పేద హిందువులను మతమార్పిడి చేసే వారి మక్కెలు విరగ్గొడతామని హెచ్చరించారు. కరీంనగర్‌లోని ఈద్గా, వేములవాడ దర్గాను తొలగించాల్సిందేనని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను సహించేది లేదన్నారు. ఎంఐఎంకు కొమ్ముకాస్తున్న వారిని చీల్చి చెండాడతామని ప్రతినబూనారు.
రజాకార్ల అరాచకాలపై రజాకార్ ఫైల్స్
‘ఇంతవరకు మీరు కశ్మీర్ ఫైల్స్ చూశారు. ఒకప్పుడు తెలంగాణలో రజాకార్ల అరాచకాలను కళ్లకు కట్టేలా రజాకార్ ఫైల్స్‌ను తీసుకొస్తాం’అని సంజయ్ ప్రకటించారు. తెలంగాణ ఆడబిడ్డలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన అకృత్యాలను కళ్లకు కడతామన్నారు. 19 శాతం ఉన్న ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న పార్టీని తరిమేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలను ఆదుకుంటామన్నారు. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాఖ్ తెచ్చిన తామే వారిని ఆదుకుంటామని, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో హిందూ సమాజం కోసం ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా, రక్షణ కవచంగా నిలబడతానన్నారు.
అంతా మీరే చేశారు
నగరంలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన వారిని తరిమికొట్టానని సంజయ్ గుర్తుచేసుకున్నారు. కరీంనగర్ బస్టాండ్, కోరుట్ల, జగిత్యాలలో బాంబు పేల్చింది మీరేనని, చొప్పదండి బ్యాంకు లూఠీ చేసింది, లుంబినీ పార్కు, గోకుల్ చాట్, సాయిబాబా ఆలయంలో బాంబులు పేల్చింది మీరేనని, వరంగల్‌లో పూజారిని హతమార్చింది, మా నాగరాజును పొట్టనపెట్టుకుందీ మీరేనని ఒకవర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు.