
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి రచయిత, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ ‘గవాయి’ కవితా సంపుటికి సినారె సాహితీ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు సాహితీ గౌతమి ప్రధానకార్యదర్శి నంది శ్రీనివాస్ తెలిపారు. ఏప్రిల్ 2 ఆదివారం సాయంత్రం కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో పురస్కారోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘గవాయి’ కవితా సంకలనం 2021 సంవత్సరానికి 32వ పురస్కారం అన్నారు. కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య ‘సాహితీ గౌతమి’ నిర్వహిస్తున్న ఈ సభకు పురస్కార కమిటీ అధ్యక్షుడు ప్రముఖ పిల్లల వైద్యుడు డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నారని ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. దేవేందర్ ఇప్పటివరకు 12 కవితా సంపుటాలు, రెండు వ్యాస సంకలనాలు మరో రెండు ఇంగ్లిష్ అనువాద కవిత్వ సంకనాలు వెలువరించారు. వీరికి గతంలో తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.

