
మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
● గోదావరిఖనికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరుపై ఆందోళన ● తరలిస్తారనే అనుమానాలు
మంథని: జిల్లాలో కొత్తగా గోదావరిఖనికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు కావడంతో మంథని కార్యాలయం పదిలమేనా..? లేక ఎక్కడికై నా తరలిస్తారా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది క్రితం మంథని కార్యాలయాన్ని తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతవాసుల్లో అనుమానాలు కల్గుతున్నారు. కాగా జిల్లాల పునర్వీభజన, రెవెన్యూ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ బదాలాయింపు జరిగి మంథని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల నమోదు మందగించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మంథనితో పాటు ముత్తారం, మల్హర్, కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్లకు సంబందించి రిజిస్ట్రేషన్ ఇక్కడే జరిగేది. ఈ క్రమంలో నిత్యం 40–50 రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరిగేవి.
నాలుగు మండలాలు.. రోజుకు పదే రిజిస్ట్రేషన్లు
మంథని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో మంథనితో పాటు ముత్తారం, కమాన్‌పూర్, రామగిరి మండలాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ రోజుకు పది రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. ప్లాట్ల రిజిస్ట్రేషన్లతో పాటు వివాహాల నమోదు చేసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 2,085 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. రూ.4.84 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడమే కాకుండా ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో మంథనిని గోదావరిఖని లేదా పెద్దపల్లిలో కలుపుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.