నవోదయ మోడల్ టెస్టుకు 150 మంది హాజరు
నరసరావుపేట: జిల్లాలోని విద్యార్థులు ప్రతిభ, విద్యానైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆదివారం కేర్ పబ్లిక్ స్కూలులో జవహర్ నవోదయ విద్యాసంస్థల ఆరో తరగతి ప్రవేశానికి మోడల్ టెస్ట్ నిర్వహించారు. దీనికి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి 150 మందికిపైగా విద్యార్థులు హాజరై మోడల్ పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ షేక్ నాగూర్‌వలి పేర్కొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్య ప్రాముఖ్యత వివరిస్తూ ఒక వ్యక్తి జీవితం సమూలంగా మార్చే ఆయుధం విద్యకు ఉందన్నారు. మోడల్ టెస్టులో ప్రథమ విజేతగా నిల్చిన రొంపిచర్లకు చెందిన ఎన్ హర్షిణికి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు సాధించిన ఒంగోలుకు చెందిన డి.అశ్రీత్, మూడవ బహుమతి రూ.3వేలును బొగ్గవరానికి చెందిన జి.సహస్రకు శాసనసభ్యులు అందజేశారు. ఛైర్మన్ కె.కోటిరెడ్డి, కరస్పాండెంట్ కె.జ్ఞానసుందరి, డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, రిటైర్డు అధ్యాపకులు కె.రాజారెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
గన్నవరం: జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏపీ అంతర్ జిల్లాల రగ్బీ అండర్–14 చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల బాల బాలికల జట్టు పాల్గొన్నాయి. తొలిరోజు బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కృష్ణాజిల్లా జట్టుతో పాటు నెల్లూరు, కడప, కర్నూలు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో ఉమ్మడి తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జట్లు సెమీఫైనల్‌కు చేరాయి.


