అనుభవం ఎంతో నేర్పింది
● మారుమూల ప్రాంతం
నుంచి వచ్చి పట్టుదలతో గుర్తింపు
● బహుముఖ ప్రజ్ఞాశాలి జేఎన్‌వీ
పీఈటీ గోవిందమ్మ
● సాదాసీదా నేపథ్యం నుంచి
ఉత్తమ శిక్షకురాలిగా రాణింపు
చిలకలూరిపేట టౌన్/యడ్లపాడు: విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పరీక్షల్లో ఓ అమ్మాయి మ్యాథ్స్‌లో ఫెయిలైంది. ఇక విద్యకు ఫుల్‌స్టాప్ పడిందనే తరుణంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ప్రకటించిన రెండు గ్రేస్ మార్కులు ఆమె విద్యాభ్యాసాన్ని మలుపు తిప్పాయి. నేడు ఆమె కృషి వందల మంది విద్యార్థినులను జాతీయ క్రీడా వేదికలకు పరిచయం చేస్తోంది. ఆవిడే చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయం వ్యాయామ ఉపాధ్యాయురాలు గుదిబెండి గోవిందమ్మ.
పట్టుదలే ఆయుధం
బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఎర్రవారిపాలెంకు చెందిన గోవిందమ్మది వ్యవసాయ కుటుంబం. సాగు, పాడి పనులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య అనేక అవరోధాలను ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలను దాటుతూ... డిగ్రీతోపాటు బీపీఎడ్, ఎంపీఈడీ, సీవైఈడీ, యోగా పట్టభద్రురాలుగా ప్రావీణ్యం పొందారు. ఉన్నత విద్యలో ప్రతిదీ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణతను సాధించడం ఆమె పట్టుదలకు తార్కాణం. విద్యతోపాటు బుర్రకథ చెప్పడంలో దిట్ట. రేడియో గాయకురాలు, కల్చరల్ విభాగంలోనూ పాఠశాల దశలోనే ప్రవేశం ఉంది. అప్పట్లోనే ఉత్తమ విద్యార్థి అవార్డులు అందుకోవడం ఆమెలో దాగి ఉన్న బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం.
32 ఏళ్ల నిబద్ధత.. 209 మందికి స్ఫూర్తి
గోవిందమ్మ 32 ఏళ్లుగా పలు జేఎన్‌వీలలో పనిచేస్తూ, 59 ఏళ్లు వచ్చినా నేటికీ క్రీడాకారులతో సమానంగా ఉత్సాహంగా శిక్షణ ఇస్తుండటం ఆమె నిబద్ధతకు నిదర్శనం. అథ్లెటిక్స్, ఖో–ఖో, కబడ్డీ, క్రికెట్, మార్షల్ ఆర్ట్స్ వంటి బహుళ క్రీడల్లో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు ఆసక్తి కలిగేలా భిన్నంగా నేర్పించడమే ఆమె ప్రత్యేకత. ఆమె మార్గదర్శకత్వంలో ఇప్పటివరకు 209 మంది విద్యార్థినులు జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు.
గ్రామీణ బాలికలకు వెన్నుదన్ను...
1994లో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తండ్రి దొరైరాజు కూడా గోవిందమ్మ కృషిని మెచ్చి ఎంతో ప్రోత్సహించారు. నెల్లూరు జేఎన్‌వీ విద్యార్థినులను జమ్మూకశ్మీర్‌లో జరిగిన క్రికెట్ పోటీల్లో తొలిసారిగా ఆడించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ ద్వారా ఆర్చరీపై మెళకువలు నేర్చుకొని శిక్షణ ఇస్తున్నారు. నెల్లూరు జేఎన్‌వీలో క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.2 లక్షలు తీసుకువచ్చి, మౌలిక వసతులు కల్పించారు. ఓటమిని లెక్కచేయకుండా, తన దారిని తానే నిర్మించుకుని, ఎందరికో ఆదర్శంగా నిలిచిన గోవిందమ్మ ప్రస్థానం నేటి యువతకు గొప్ప స్ఫూర్తి. తనను తాను క్రీడలకే అంకితం చేసుకున్నారామె.
సాదాసీదా గ్రామీణ ప్రాంత బాలికల కష్టాలే నావి. ఓటమి అడ్డంకి కాదు.. ఆరంభమని అనుభవం నేర్పింది. పదితోనే విద్య ఆగుతుందని నిరాశ చెందిన తరుణంలో ఒక్క అవకాశం ఎన్నో అవరోధాల్ని దాటించేసింది. అది అదృష్టమో లేక అవకాశమో స్పష్టంగా తెలీదు. కానీ, బాల్యంలో సమాజం, కష్టాలు నన్ను ఎంతో బాధించి ప్రతి అడుగును వెనక్కు లాగేందుకు ప్రయత్నించాయి. నాలో తెలియని ధైర్యం, మొండితనం, పట్టుదలే లక్ష్యాన్ని సాధించేలా చేశాయి. నాలాంటి ఎందరో బాలికలకు భరోసాగా నిలిచే గొప్ప అవకాశాన్ని ఇచ్చాయి.
– జి. గోవిందమ్మ,
పీఈటీ, జేఎన్‌వీ– మద్దిరాల
అనుభవం ఎంతో నేర్పింది
అనుభవం ఎంతో నేర్పింది


