రోడ్డు ప్రమాదాలను నివారించాలి
బాపట్ల టౌన్: రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జిల్లాలోని హైవే, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్, ఆర్ అండ్ బీ అధికారులతోపాటు జిల్లాలోని డీఎస్పీలు, హైవేల పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత మూడు సంవత్సరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికను, ఎక్కువగా రోడ్డు సంభవిస్తున్న బ్లాక్ స్పాట్స్‌ను పీపీటీ ద్వారా తెరపై ప్రదర్శించారు.రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో సంభవించే మరణాల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్టీవో, ఆర్ అండ్ బీ, హైవే అధికారులు సంయుక్త కార్యచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో డిస్టిక్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్ టి.కె.పరంధామరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ డి.ప్రసాదరావు, రేపల్లె, బాపట్ల, చీరాల, సీసీఎస్ డీఎస్పీలు ఏ.శ్రీనివాసరావు, జి.రామాంజనేయులు, ఎండీమోయిన్, పి.జగదీష్‌నాయక్, నాన్ హైవే, జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216, జాతీయ రహదారి 167(ఎ)ల అధికారులు, జాతీయ రహదారులు ఉన్న సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
మేదరమెట్ల: రోడ్డు క్రాస్ చేస్తున్న మోటా రు బైక్‌ను కారు ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కొరిశపాడు జాతీయరహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై బుధవారం చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం గణపవరానికి చెందిన రోశయ్య మరో వ్యక్తితో కలిసి మోటారు బైక్‌పై వెళుతూ కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు సమీపంలో గల గాజు ఫ్యాక్టరీ వద్ద బైకును రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి బద్వేల్‌కు వెళుతున్న కారు మోటారు బైకును ఢీకొంది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా హైవే అంబులెన్స్‌లో ఒంగోలు కిమ్స్‌కు తరలించారు. మేదరమెట్ల ఎస్‌ఐ మహ్మద్ రఫీ ప్రమాద వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


