విద్యార్థులను తీర్చిదిద్దడానికి టింకరింగ్ ల్యాబ్స్ దో
నరసరావుపేట రూరల్: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ దోహదపడతాయని డీఈవో చంద్రకళ తెలిపారు. నీతి అయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, సమగ్ర శిక్ష, యూనిసెఫ్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌చార్జ్‌లకు లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. జిల్లాలోని 23 ఏటీఎల్ స్కూల్ నుంచి ఇన్‌చార్జ్‌లు శిక్షణకు హాజరయ్యారు. శిక్షణలో భాగంగా ఇన్‌చార్జ్‌లతో ఎగ్జిబిట్స్‌ను తయారు చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీవైఈవో సుభాని మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న విషయాలను విద్యార్థులతో పంచుకుని ఎగ్జిబిట్స్ తయారు చేయించాలని తెలిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సమర్థ వినియోగం ద్వారా కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన పది లక్షల మంది విద్యార్థులను పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలుగా తయారు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీవైఈవోలు ఎస్‌కె సుభాని, వి.ఏసుబాబు, జిల్లా సైన్స్ అధికారి ఎస్.రాజశేఖర్ పాల్గొన్నారు. టెక్నికల్ పర్సన్‌లుగా వెంకట్, వాణి వ్యవహరించారు.


