ప్రతికూల వాతావరణంతో సతమతమవుతున్న రైతుకు కనీసం కోసిన పంట
జిల్లాలో ముమ్మరం కానున్న వరి కోతలు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ కోతలు పూర్తయితే పంటను కాపాడుకునేదెలా ఆందోళన చెందుతున్న పల్నాడు రైతులు గత ప్రభుత్వంలో రాయితీపై టార్పాలిన్‌లు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు
●
సత్తెనపల్లి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతు భరోసా కేంద్రాలను అప్రమత్తం చేసేది. విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి రైతుమిత్ర సంఘాలకు పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లు, కోతమిషన్లు, నూర్పిడి యంత్రాలు ఇలా అన్నిటిని అందించేది. ఇవే కాకుండా ప్రతి రైతు భరోసా కేంద్ర వద్ద కనీసం 50 నుంచి అధికంగా 150 వరకు టార్పాలిన్ పట్టలు అందుబాటులో ఉంచేది. 40 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ఈ టార్పాలిన్‌లను రైతులకు 50 శాతం రాయితీతో అందించేది. రూ.1200 చెల్లిస్తే రైతులకు టార్పాలిన్‌లు అందేవి. వర్షాలకు పంట తడిసిపోకుండా కాపాడేవి. వరి పొలంలో కోత కోసిన కుప్పలపై రక్షణకు, పంట నూర్పిడి సమయంలో నేల మీద వేసేందుకు, ధాన్యం ఆరబెట్టేందుకు ఉపయోగపడేవి. అనంతరం రబీలో కూడా వీటి వినియోగం కొనసాగేది.
వెలుగు కార్యాలయాలకు ..
ఇవే కాకుండా డ్వాక్రా సంఘాల ద్వారా వెలుగు కార్యాలయాలకు మరికొంత పెద్ద సైజులో ఉండే టార్పాలిన్‌లను రాయితీపై ఇచ్చే వారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదు.
రాయితీలు లేకపోవడంతో రైతులు బయట వ్యాపారుల వద్ద అధిక మొత్తం డబ్బులు చెల్లించి టార్పాలిన్‌లు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. రైతులకు గతంలో మాదిరిగా కోత మిషన్లు, నూర్పిడి యంత్రాలు ఇవ్వకపోవడంతో పాటు ఈ–క్రాప్ నమోదు మందకొడిగా చేస్తుండడంతో రైతులు పంట నూర్పిడి చేయకుండా పంట పొలాల్లో, కల్లాల్లో కుప్పలు వేసి విడిచి పెడుతున్నారు.


