స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే షెడ్యూల్ ప్రకటనపై విద్య
ఏఎన్‌యూ పీజీ మొదటి సెమిస్టర్
పరీక్షల ఫీజు షెడ్యూలు ప్రకటన
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ అధికారుల వింత ధోరణికి విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. పీజీ కౌన్సెలింగ్‌లో రెండు విడతల్లో అడ్మిషన్లు నిర్వహించిన నిర్వాహకులు స్పాట్ అడ్మిషన్లపై ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ అధికారులు స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ మంత్రి నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. వర్సిటీలోని పలు విభాగాల్లో స్పాట్ అడ్మిషన్ల వల్ల సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనివార్య కారణాల వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం ప్రతి ఏడాది స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. స్కాలర్‌షిప్ రాకపోయినా పర్వాలేదు, సంవత్సరం వృథా కాకూడదనే భావనతో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆయా కోర్సుల్లో చేరుతూ ఉంటారు.
ఈ సారి స్పాట్ అడ్మిషన్ జరగకుండానే ఫీజుల షెడ్యూల్ ప్రకటించడం గందగోళానికి దారి తీసింది. వర్సిటీ అధికారుల నిర్ణయంతో తమకు ఏడాది కాలం వృథా అవుతుందని స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న పలువురు విద్యార్థులు వాపోయారు. దీనిపై సీఈఓ ఆలపాటి శివప్రసాద్‌ను వివరణ కోరగా అడ్మిషన్లకు తనకు సంబంధం లేదని, అకడమిక్ క్యాలండర్ ప్రకారం మంగళవారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
పెదకాకాని నవశక్తి క్షేత్రంలో చోరీ
పెదకాకాని: పెదకాకాని నవశక్తి క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి ఆభరణాలతో పాటు మూడు హుండీలను ఎత్తుకెత్తిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండల కేంద్రమైన పెదకాకాని శివారులో వెనిగండ్ల నుంచి అగతవరప్పాడు వెళ్లే రోడ్డులో నవశక్తి పీఠం ఉంది. ఈ క్షేత్రంలో నిత్యం పూజా కై ంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఆలయ తలుపులకు అర్చకులు తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం ఉదయం గుడి వద్దకు వెళ్లి చూడగా తాళాలు వేసిన గడి పగులగొట్టి తలుపులు తీసి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో అమ్మవారి ఆభరణాలు 12 మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, 2 ముక్కుపుడకలు, ఆలయంలో అమర్చిన మూడు హుండీలు ఎత్తుకెళ్లారు. ఆభరణాలు సుమారు 50 గ్రాములని ఆలయ నిర్వాహకులు తెలిపారు.


