వినుకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించటానికి అదాలత్ దోహదపడుతుందని సీజీఆర్‌ఎఫ్ చైర్మన్, జిల్లా విశ్రాంత న్యాయమూర్తి ఎస్.విక్టర్ ఇమ్మానుయేలు అన్నారు. మంగళవారం పట్టణంలోని కారంపూడి రహదారి మార్గం విద్యుత్ స్టేషను ప్రాంగణంలో అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యలు ఉంటే ఆధారాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేస్తామన్నారు. రీడింగ్, మీటర్లలో పేర్లు మార్పు, అధిక బిల్లులు, కేటగిరీ మార్పులు తదితర సమస్యలు వస్తున్నాయని తెలిపారు. వీటిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించటంతో పాటు వినియోగదారులకు సకాలంలో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జిల్లా స్థాయిలో రెండు నెలలకొకసారి ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో సమస్యలు సులువుగా పరిష్కారం అవుతున్నాయన్నారు. నూజెండ్ల మండలం అల్లిభాయిపాలెం గ్రామంలో విద్యుత్ లైను సమస్యపై వచ్చిన ఫిర్యాదుపై అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖాధికారి డాక్టరు పత్తిపాటి విజయ్‌కుమార్, ఫోరం సభ్యులు సునీత, డి.కృష్ణనాయక్, ఆర్.శ్రీనివాసరావు, డీఈ చేజర్ల రాంబోట్ల, ఏడీఏ భవనం వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, ఏఈలు జవ్వాజి నటరాజ్ తదితరులు ఉన్నారు.
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేలు


