రైతులకు మేలు చేసేలా కేంద్రానికి లేఖ
సత్తెనపల్లి: పత్తి రైతులకు మేలు చేసేలా కేంద్రానికి లేఖ రాశామని, 18 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని విన్నవించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గుంటూరు రోడ్డులోని జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5.40 లక్షల హెక్టార్లలో పత్తి పండిందని, మోంథా తుఫాన్‌తో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పరిహారం చెల్లించేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. సీసీఐ నిబంధనలతో పంట అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


