పొలాల్లో చేతికి వచ్చే దశలో వరి పంట
మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్న కోతలు
తుపాను ప్రభావం లేదంటున్న అధికారులు
చల్లని గాలులు వీస్తుండటంతో రైతుల ఆందోళన
జిల్లాలో 53,090 హెక్టార్లలో వరి పంట సాగు
తుపాను ప్రభావం ఉండకపోవచ్చు
చంద్రబాబు సర్కారు వచ్చాక ఆరుగాలం చెమటోడ్చిన అన్నదాతలకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. కనీసం ఇంటిలో తిండి గింజలైనా వస్తాయనే ఆశతో సాగు చేసిన వారికి తుపానులు, చీడపీడలు, మద్దతు ధర దక్కకపోవడం వంటి దెబ్బలు తప్పడం లేదు. పెట్టుబడులు రావడం లేదు. మోంథా తుఫాన్ నుంచి తేరుకున్న రైతులకు మళ్లీ ఇప్పుడు పంట చివరి దశలో మళ్లీ తుపాను తప్పదేమోననే ఆందోళన వెంటాడుతోంది.
సత్తెనపల్లి: జిల్లాలో తుపాను ప్రభావం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ చల్లని గాలులు వీస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురవక రైతులు ముప్పుతిప్పలు పడ్డారు. తర్వాత ఆలస్యంగా కురిసిన వర్షాలతో వరి నాట్లు గతంలో కంటే అధికంగా వేశారు. మరి కొన్ని చోట్ల పొలాల్లో సరిపడా నీరు లేక మోటార్ల సహాయంతో నింపుకొని దమ్ములు చేసి మరీ వరినాట్లు వేశారు. ఆ తర్వాత అడపాదడపా కురిసిన భారీ వర్షాలతో వరి పొలాలు కొంత ముంపు బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల భయాందోళనలకు గురి చేసిన మోంథా వర్షాలు పంటలను ముంచేయడంతో తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 114.75 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ గణంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు మరో తుఫాను వస్తే పరిస్థితి ఏంటని రైతులు కలవరం చెందుతున్నారు.
కోతలు ప్రారంభం
జిల్లాలో ఈ ఏడాది వరి నాట్లు ఆలస్యంగా మొదలైనప్పటికీ ఆయా రకాల వరి విత్తనాలు కాలపరిమితి మేరకు గింజ తయారై ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని నకరికల్లు ఏరియాలో వరి కోతలు ప్రారంభం కాగా... మరో 15 రోజుల్లో జిల్లా అంతటా కోతకు సిద్ధం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం 38,599 హెక్టార్లు. ఈ ఏడాది 53,090 హెక్టార్లలో వరి సాగైంది. రానున్న 15 రోజుల్లో కోతకు పూర్తి స్ధాయిలో సిద్ధమవుతున్నా. గత నెలలో మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వరి పంట నీట మునిగి రైతులు నష్టపోయారు. మళ్లీ తుపాను వస్తే కోలుకోలేని నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు.
వాతావరణంలో మార్పులు...
జిల్లాలో వారం రోజుల క్రితం గజగజ వణికించిన చలిగాలులు ఇప్పుడు కాస్త చల్లగాలులుగా మారిపోయాయి. రాత్రీపగలు తేడా లేకుండా చల్లగాలులు వీస్తున్నాయి. వాతావరణ మార్పులు తుపాను హెచ్చరికలను సూచిస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే గింజ తయారై కొన్ని కోతలకు రాగా, మరికొన్ని పొలాలు 15రోజుల్లో కోతకు సిద్ధం కానున్నాయి. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు. పంటలతో పాటు వరి పొలాల్లో నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలుత ఈ నెల 24న తుపాను అనుకున్నప్పటికీ ప్రస్తుతం 26 నుంచి 29 వరకు రాష్ట్రంలోని కొన్ని ఏరియాల్లో ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాపై ఎటువంటి ప్రభావం ఉండదని వాతావరణ శాఖ ప్రకటనల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో తుపాను ప్రభావానికి అవకాశం లేదని వాతావరణ శాఖ ద్వారా తెలుస్తోంది.రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అయితే అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇప్పటికే జిల్లాలోని నకరికల్లు ప్రాంతంలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. మంచి ధర పలికేలా కొనుగోలు కేంద్రాలు కూడా ఒకటి, రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నాం.
–ఎం. జగ్గారావు,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పల్నాడు
చివరిలో కలవరం!


