పైసా పరిహారం ఇస్తే ఒట్టు ..!
రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వటంలో చంద్రబాబు సర్కార్ మొద్దు నిద్ర
జిల్లాలో మోంథా తుఫాన్‌తో భారీగా నష్టపోయిన అన్నదాతలు
జిల్లాలో 1,730.25 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు గణాంకాలు
సత్తెనపల్లి: రైతు సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే..దానికి విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. తాజాగా మోంథా తుఫాన్‌తో రైతులకు తీవ్రంగా పంట నష్టం జరిగింది. అయినా ఇప్పటివరకు రైతులను ఆదుకునే ప్రయత్నమే చేయలేదు. రైతులకు అండగా ఉండాల్సింది పోయి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది.
జిల్లాలో 1730.25 హెక్టార్లలో పంట నష్టం....
పల్నాడు జిల్లా వ్యాప్తంగా 2024 అక్టోబర్‌లో కురిసిన అకాల వర్షాలకు రైతులకు నష్టం వాటిల్లింది. అప్పట్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదికలు కూడా పంపారు. కానీ ఒక్క పైసా పరిహారం విడుదల కాలేదు. తాజాగా గత నెలలో మోంథా తుఫాన్ ధాటికి జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పత్తి పంట చేతికి వచ్చే తరుణంలో కాయ నల్లగా మారి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. జిల్లాలో మొత్తం 1730.25 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు, 3,377 మంది రైతులకు పరిహారం అందించేలా జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది.


