అర్జీలు నాణ్యతతో పరిష్కరించాలి
ధాన్యం సేకరణ పోస్టర్ ఆవిష్కరణ
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు అందిన అర్జీలు నాణ్యతతో పరిష్కరించటంపై దృష్టి సారించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 122 అర్జీలు స్వీకరించారు. అర్జీలకు సంబంధించిన ఆడిట్‌ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ప్రతి వారం తనిఖీలు నిర్వహించాలని, ఆయా మండలాలకు వెళ్లినప్పుడు గ్రీవెన్స్ జాబితా సిద్ధంగా ఉంచి అధికారులకు చెప్పాలన్నారు. ఒకటీ రెండు అర్జీలు స్వయంగా తనిఖీ చేయటం ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకొని ఫీడ్ బ్యాక్ అందించాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిచాలన్నారు. తాను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయగా అర్జీల పరిష్కారంలో నాణ్యత సరిగా లేదని గుర్తించినట్లు తెలిపారు. తహసీల్దార్లు వారి దగ్గరకు వచ్చిన గ్రీవెన్స్ సరైన విధంగా పరిష్కరించారా అనేది చూడాలన్నారు. అర్జీలు పరిష్కరించే బాధ్యత క్షేతస్థాయి అధికారులపైనే ఉందన్నారు. లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్షేత్రస్థాయి అధికారులు కలెక్టరేట్ నుంచి ఏ అర్జీ వచ్చినా వ్యక్తిగతంగా పరిశీలన చేసి పరిష్కరించాలని, ఆ విధంగా చేయకుండా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన రెఫరెన్స్‌లను పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులకు ఈ ఆఫీసు ద్వారా తపాలా పంపించటం జరుగుతుందని, వాటిని తీసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


