ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
నరసరావుపేట రూరల్: ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు దండుకున్నట్టు పలువురు బాధితులు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో పెద్దమొత్తంలో నగదును మోస పోయినట్టు బాధితుడు ఫిర్యాదు చేశాడు. వీటితో పాటు కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలకు సంబంధించి 111 ఫిర్యాదులు ఎస్పీకి అందాయి. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరిగతిన పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మోసాలపై ఫిర్యాదులు ఇలా...
● ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ 36.40లక్షలు తీసుకుని మోసం చేసినట్టు 12మంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లికి చెందిన శిరికొండ వెంకట్రావు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని 2021లో డబ్బులు వసూలు చేశాడు. తరువాత నకిలి అపాయిమెంట్ లెటర్లు సృషించి వీరిని మోసం చేశాడు. దీన్ని గుర్తించిన బాధితులు డబ్బులు ఇవ్వమని నిలదీశారు. ఇవ్వకుండా వేధిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
● హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ మోసం చేసి రూ.5లక్షలు తీసుకున్నట్టు బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విజయవాడకు చెందిన మహిళ తాను హైకోర్టులో పని చేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డు చూపించింది. హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకు రూ.5లక్షలు ఇవ్వాలని చెప్పడంతో నమ్మి పలు ధఫాలుగా డబ్బులు చెల్లించినట్టు తెలిపింది. రెండు నెలల్లో అపాయింట్‌మెంట్ ఆర్డర్ వస్తుందని చెప్పిందని, తరువాత నుంచి ఫోన్ చేయగా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. అనుమానంతో విచారించగా ఆమెకు హైకోర్డులో ఎలాంటి ఉద్యోగం లేదని తెలిందని, తనను మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కోరింది.
● ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే 200 రెట్లు లాభాలు పొందవచ్చని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్ నమ్మి రూ.81లక్షలు మోసపోయినట్టు నరసరావుపేట కాకతీయనగర్‌కు చెందిన వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఫోన్‌లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి మొదట రూ.3లక్షలు పెట్టుబడి పెట్టగా రూ.1.5లక్షలు లాభం వచ్చినట్టు తెలిపారు. దీంతో వారి మాటలు నమ్మి పొలం తాకట్టు పెట్టి రూ.81లక్షలు పలు దఫాలుగా పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. తరువాత లాభాల నగదు ఉపసంహరణకు ప్రయత్నించగా అదనంగా 20శాతం కమీషన్ చెల్లించాలని చెప్పారని పేర్కొన్నాడు. కొంత కాలానికి తన నంబర్‌ను బ్లాక్‌లో పెట్టారని ఫిర్యాదులో తెలిపాడు.
జిల్లా ఎస్పీకి పలువురు
బాధితుల ఫిర్యాదు


