సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన
నరసరావుపేట: సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే హెచ్‌ఆర్ పాలసీ, మినిమం ఆఫ్ టైమ్ శాలరీ(ఎంటీఎస్) అమలు చేయాలని జేఏసీ ఫెడరేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్టేషన్‌రోడ్డులోని గాంధీ పార్కు వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరేకు వినతిపత్రం సమర్పించారు. పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ఏర్పడి 15 నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. జీతాల పెంపు, సమయానికి చెల్లింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్, రిటైర్‌మెంట్ వయస్సు 62ఏళ్లకు పెంచటం, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాల అమలు, ఆరోగ్య బీమా, మెడికల్ సదుపాయాలు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 10న చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులు పాల్గొని తమ న్యాయమైన హక్కులకోసం పోరాడాలని జేఏసీ నాయకులు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్, ఉపాధ్యక్షులు పి.రామకృష్ణ, ఉద్యోగులు ఖాసీంవలి, సుబ్బాయమ్మ, మంజూష, జయప్రకాష్ పాల్గొన్నారు.
లింగాపురంలో ఘర్షణ
ఇద్దరికి గాయాలు
మాచర్ల రూరల్: మండలంలో పరస్పర దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన మండలంలోని లింగాపురంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జింకల వెంకటేశ్వర్లు, రాగి నాగేశ్వరరావు మధ్య చిన్న ఘర్షణ ఏర్పడి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్‌ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని మహిళకు గాయాలు
వేగంగా వెళ్తున్న కారు ఢీకొని పశువుల కాపరి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కంభంపాడులో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కె. రమణమ్మ పొలం నుంచి పశువులను తోలుకొని ఇంటికి వెళ్తుండగా, గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రమణ తల, కాలుకు గాయాలయ్యాయి. మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు తరలించారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన


