తల్లి, కుమారుడిని కలిపిన జ్యోతి ఫౌండేషన్
సత్తెనపల్లి: మతిస్థిమితం లేని యువకుడు ఐదు నెలల క్రితం తప్పి పోవటంతో తల్లి వెతకని చోటు లేదు. ఎక్కడా జాడ కనిపించక ఆందోళన చెందుతున్న తరుణంలో సత్తెనపల్లి నుంచి వచ్చిన ఫోన్‌తో ఆ తల్లి ఆనందానికి ఆవధులు లేవు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో గత రెండు రోజుల క్రితం మాసిపోయిన బట్టలతో మతిస్థిమితం లేక తిరుగుతున్న యువకుడ్ని ఆటో వాళ్ళు గుర్తించి జ్యోతిఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓలేటి కుమారి మతిస్థిమితం లేని 20 సంవత్సరాల మంజునాథ్ అనే కర్ణాటకకు చెందిన యువకుడిని అక్కున చేర్చుకొని జ్యోతి ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకుని వచ్చి సపర్యలు చేయించింది. అతనికి స్నానం చేయించే క్రమంలో అతని చేతి మీద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా కర్ణాటకలో ఉన్న యువకుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం తో వారి తల్లిదండ్రుల వద్ద ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి వారికి వారి కుమారుడు మంజునాథ్‌ను అప్పగించింది. ఈ సందర్భంగా మంజునాథ్ తల్లి అన్నపూర్ణ మాట్లాడుతూ సత్తెనపల్లిలో నా బిడ్డ ఉన్నాడని జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారి ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్‌లో నా బిడ్డను చూసుకొని చాలా సంతోషించానని, తమ కుమారుడ్ని తమకు అప్పగించిన ఓలేటి కుమారికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాది దివ్వెల శ్రీనివాస రావు, సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొతుగంటి రామకోటేశ్వరరావు వెంట ఉన్నారు.


