జై చెన్నకేశవ ..మార్మోగిన పల్నాటి రణక్షేత్రం
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలలో మూడో రోజైన శుక్రవారం రణక్షేత్రం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. గోవింద నామస్మరణలు, జై చెన్నకేశవ నినాదాలు మిన్నంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సకల వీరాచారులంతా ఆయుధాలను చేతపట్టి కదం తొక్కారు. సంప్రదాయ డోలు సన్నాయిమేళాలు, వెనుక వీరుల ఆయుధాలతో వీరంగమాడుతూ వీరాచారులు, ఆ వెనుక అంకమ్మ బుట్టలతో పొంగళ్లతో మహిళలు గ్రామోత్సవాలు నిర్వహించారు. చెన్నకేశవస్వామి అంకాలమ్మ తల్లి గుడుల వైపు కదిలారు. ఆలయాల నుంచి బయటకు వచ్చిన వారు ఒక్కరుగా కత్తి సేవ లు చేసుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆచారం ఉన్న వారంతా కత్తులను గుండెలపై మోదుకుంటూ గోవింద నామస్మరణ చేశారు. అంకాలమ్మ తల్లి గుడిలో చెన్నకేశవస్వామి ఆలయం వెలుపల, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద కత్తి సేవలు కొనసాగాయి. మహిళలు పొంగళ్లు చేసుకుని సమర్పించారు. నాగులేరు ఒడ్డున వీరుల గుడిలో పొంగళ్లు చేసుకుని ప్రధాన గ్రామోత్సవంతో కదలలేని వారు విడివిడిగా మొక్కులు చెల్లించారు. రాత్రికి మందపోరు కథాగానాన్ని వీరాచారులు ఆలపించారు.అత్యంత రక్తసిక్తమైన మందపోరు యుద్ధాన్ని అత్యంత హృద్యంగా ఆలపించారు.
నేడు కోడిపోరు
పల్నాటి ఉత్సవాలు ఐదు రోజుల్లో ప్రధానమైన కోడిపోరు ఉత్సవం శనివారం జరగనుంది. వీరుల గుడి ఆవరణలో అలనాడు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మల మధ్య జరిగిన కోడిపోరును నాటకీయంగా ప్రదర్శించనున్నారు. వీర విద్యావంతులు కోడిపోరు కథాగానం చేస్తారు. ఆదివారం కళ్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయి.
మందపోరు నాడు
ఉప్పొంగిన భక్తిపారవశ్యం
జై చెన్నకేశవ ..మార్మోగిన పల్నాటి రణక్షేత్రం


