ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలి
నరసరావుపేట: మావోయిస్టు అగ్ర నాయకులు హిడ్మా, టేక్ శంకర్, పలువురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. గురువారం పట్టణంలోని స్టేషన్‌రోడ్డు గాంధీపార్కు ఎదుట ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు మాట్లాడుతూ అల్లూరు జిల్లా మారేడుమల్లిలో అగ్ర నాయకులు హిడ్మా, అతడి భార్య రాజే మరో నలుగురు మావోయిస్టులు, ఆ మరుసటిరోజు టేక్ శంకర్‌తో సహా ఏడుగురు చొప్పున ఎన్‌కౌంటర్‌కు గురయ్యారన్నారు. వీటిపై ప్రజలకు అనుమానాలు ఉన్నందున న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కగార్ పేరుతో రెండేళ్ల నుంచి 720 మందికి పైగా ఆదివాసులు, మావోయిస్టులను ఎన్‌కౌంటర్ల పేరుతో చంపిందన్నారు. దీనిపై ఎలాంటి విచారణ లేకపోవడం దారుణమన్నారు. ఇది భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. మావోయిస్టులు, ఆదివాసులతో శాంతి చర్చలు నిర్వహించాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపుతున్నారన్నారు. దేశ ప్రజలు మౌనం వీడి ఈ నరమేదాన్ని ఆపివేయాలని ఉద్యమించాలని కోరారు. దోపిడీ వ్యతిరేక పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్‌వలి, కార్యదర్శి జి.రామకృష్ణ, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శిఖినం చిన్న, ప్రజా కళామండలి రాష్ట్ర నాయకురాలు ఉన్నం రాణి పాల్గొన్నారు.


