అంగన్‌వాడీలకు మంగళం
అంగన్‌వాడీల విలీన ప్రక్రియ సరైంది కాదు
ప్రాథమిక పాఠశాలలో విలీనానికి అడుగులు
పైలెట్ ప్రాజెక్ట్‌గా పల్నాడులో క్రోసూరు మండలం ఎంపిక
త్వరలో పరిశీలనకు ఎన్‌సీఈఆర్‌టీ బృందం
విలీనం చేయవద్దంటూ సచివాలయాలలో వినతులు
అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళం పాడేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంతోపాటు టీకాలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తూ కీలకంగా వ్యవహరిస్తున్న ఈ కేంద్రాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బాబు సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సత్తెనపల్లి: పలు అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంగన్‌వాడీల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అనాలోచిత నిర్ణయాలతో అటు ఆరేళ్ల లోపు పిల్లలకు, ఇటు గర్భిణులు, బాలింతలకు తీరని అన్యాయం చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా క్రోసూరు మండలాన్ని ఎంపిక చేశారు. మండల స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో చైర్మన్‌గా మండల విద్యాశాఖాధికారి(ఎంఈఓ), కో చైర్‌పర్సన్‌గా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ), మెంబర్లుగా ప్రధానోపాధ్యాయులు(హెచ్‌ఎమ్), అంగన్‌వాడీ వర్కర్స్, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, స్వయం సహాయక సంఘాల తల్లుల కమిటీలో ఉంటారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాఠశాలలు ఎంత దూరంలో ఉన్నాయి. ఏ ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు. 200 మీటర్లు దగ్గరలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసి అమలు చేసేందుకు పరిశీలిస్తున్నారు. చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం అనుబంధ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయు) ఆధ్వర్యంలో ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు.
తొలి దశ బడి ప్రాంగణంలోవి...
తొలి దశలో సర్కార్ ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేయాలని నిర్ణయించింది. రెండో దశలో మిగిలిన వాటిని విలీనం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) బృందం కూడా జిల్లాలో పర్యటించనుంది.
ఆరు ప్రధాన సేవలు బంద్...
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల లోపు పిల్లలు, గర్భవతులు, బాలింతలకు పలు రకాల సేవలు అందుతున్నాయి. ఈ క్రమంలో అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాల ల్లో విలీనం చేస్తే ఈ సేవలు అన్ని బంద్ కానున్నాయి. ముఖ్యంగా పోషకాహారం పంపిణీ, ప్రీ–స్కూల్‌విద్య, ఆరోగ్యవిద్య, రెఫరల్‌సేవలు, తదితర సేవలన్నీ ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నాయి. ఈ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేస్తే ఆయా సేవలన్నీ అందే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం తక్షణం విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతామని సీఐటీయూ నేతలు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో అంగన్‌వాడీ ప్రాజెక్ట్‌లు : 09
మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు : 2,010
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు : 21
6 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య : 1,05,811
బాలింతలు : 9,587 మంది
గర్భవతులు : 9,368 మంది
అంగన్‌వాడీలను పాఠశాలల్లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. మూడేళ్ల లోపు చిన్నారులందరినీ ఖచ్చితంగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపి బలోపేతం చేయాలి. ఇప్పటికే అనేక రకాల యాప్‌లు ప్రవేశపెట్టి అంగన్వాడీ కార్యకర్తలను మరింత వేధింపులకు గురి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లు పనిచేయక అనేక అవస్థలు పడుతున్నారు.
– గుంటూరు మల్లేశ్వరి,
సీఐటీయూ గౌరవ అధ్యక్షురాలు, పల్నాడు జిల్లా
అంగన్‌వాడీలకు మంగళం
అంగన్‌వాడీలకు మంగళం


