టిప్పర్ ఢీకొని మహిళ మృతి
సత్తెనపల్లి: ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి గాయాలైన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఐదులాంతర్ల సెంటర్‌లో బుధవారం రాత్రి జరిగింది. పట్టణంలోని 26వ వార్డుకు చెందిన కోటపాటి కృష్ణకుమారి (59), నాగమల్లేశ్వరరావు దంపతులు. కృష్ణకుమారి భర్త గతంలోనే మృతి చెందాడు. వారికి కుమారులు కృష్ణ, వెంకట్రావు ఉన్నారు. వెంకట్రావు ఆర్టీసీలో హయ్యర్ బస్సు కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ డిపో వద్దకు చిన్న కుమారుడు వెంకట్రావుతో ద్విచక్ర వాహనంపై కృష్ణకుమారి బుధవారం రాత్రి బయలుదేరారు. అచ్చంపేట రోడ్డు నుంచి గుంటూరు వైపు మలుపు తిరిగే క్రమంలో ఖాళీ టిప్పర్ ఢీకొట్టడంతో కృష్ణకుమారి కింద పడ్డారు. ఆమె తలపై నుంచి టిప్పర్ చక్రం వెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. వెంకట్రావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండమోడు– పేరేచర్ల జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టణ పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. వాహనాలను క్రమబద్ధీకరించారు. వెంకట్రావు ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ పి.పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


