ఏడు మిల్లుల్లో పత్తి కొనుగోలు
నరసరావుపేట/సత్తెనపల్లి: జిల్లాలో కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ఏడు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు మొదలు పెట్టారని జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి కేవీఎన్ ఉపేంద్రకుమార్ పేర్కొన్నారు. మిగతా నాలుగు మిల్లుల్లో కూడా త్వరలో కొనుగోళ్లు మొదలు పెడతారన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సత్తెనపల్లిలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీ జిన్నింగ్ మిల్లును సందర్శించారని తెలిపారు. పత్తి కొనుగోలును పరిశీలించారన్నారు. రైతులకు గ్రామ రైతు సేవ కేంద్రాల ద్వారా అవగాహన కల్పించామని పేర్కొన్నారు. రైతులు తెచ్చిన పత్తిలో తేమ 8 నుంచి 12లోపు ఉంటేనే వారికి స్లాట్ బుకింగ్ చేస్తారన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి శుభ్రమైన తేమలేని, రంగుమారని పత్తిని తెచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.


