విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
బెల్లంకొండ: విద్యుత్ షార్ట్ సర్క్యూతో ఇల్లు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని సుగాలి కాలనీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుడు మాచర్ల షేక్ మొహమ్మద్ ఖాసిం తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సుగాలీ కాలనీలో మువ్వ శీను ఇంట్లో మొహమ్మద్ ఖాసిం గత కొన్ని నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కాగా బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో నిప్పు అంటుకుందని బాధితుడు తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న బీరువాలోని సామగ్రి, వస్తువులు, దుస్తులు, టీవీ, ఫ్యాన్లు, ఇంట్లో సామగ్రి, వంట సామాన్లుతోపాటు రూ.20వేలు నగదు అగ్నికి ఆహుతి అయిందన్నారు. స్థానికులు గమనించి వెంటనే మంటలను ఆర్పివేశారు. ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో మొహమ్మద్ ఖాసిం కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.


