లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): కస్టమ్స్, సెంట్రల్ ఎకై ్సజ్, జీఎస్టీ విభాగాలలో ఐఆర్‌ఎస్ అధికారి ఎం.నాగరాజు అందించిన సేవలు ఆదర్శనీయమని సెంట్రల్ జీఎస్‌టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ పేర్కొన్నారు. శుక్రవారం పలకలూరు రోడ్‌లోని గుంటూరు క్లబ్‌లో జరిగిన నాగరాజు ఉద్యోగ విరమణ సభలో ఆయన ప్రసంగించారు. రిటైర్డ్ జీఎస్‌టీ చీఫ్ కమిషనర్ సి.పి.రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుజిత్ మల్లిక్ మాట్లాడుతూ నాగరాజు శాఖాపరంగా ఎన్నో ప్రభుత్వ అవార్డులు, రివార్డులు పొంది శాఖకు గర్వకారణంగా నిలిచారన్నారు. ఉద్యోగ సంఘం నేతగా ఉద్యోగుల సంక్షేమానికి మెరుగైన సేవలు అందించారని ప్రశంసించారు. రిటైర్డ్ చీఫ్ కమిషనర్ సి.పి.రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో దక్షత, సమర్థత, విశ్వసనీయత కలిగిన అధికారి నాగరాజు అని ప్రశంసించారు. నాగరాజును మాజీ ఎమ్మెల్సీ పందుల రవీంద్ర బాబు, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు గాదె శ్రీనివాస రెడ్డి, పలువురు అధికారులు సత్కరించారు.


