
జలజీవన్ మిషన్ తీరుపై విచారణ
గుంటూరు వెస్ట్: వర్షపు నీటిని వడిసి పట్టడమే లక్ష్యంగా కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతి పరిశీలించడానికి కేంద్ర జల శక్తి శాఖ పరిశీలకులు కిరణ్‌కుమార్ కర్లపు, రేష్మి పిళ్‌లైతో కూడిన అధికారుల బృందం రెండు రోజులుగా జిల్లాలో పర్యటించింది. పలు ప్రాంతాల్లో స్థానికులతో మమేకమై ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న ఫారం ఫాండ్, వాననీటి సంరక్షణ, నిర్మాణాలు, అమృత్ సరోవర్లు, నర్సరీలు, పండ్లు, పూలతోటలు పెంపకం, తదితర విషయాలను పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో చేపడుతున్న పనులు బాగున్నప్పటికీ వాటిని వెబ్‌సైట్‌ల్లో ఫొటోలు అప్‌లోడు చేయకపోవడం వల్ల పురోగతి మార్గాలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు నడుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రుతుపవనాలు రావడానికి ముందు, తరువాత నీటి లభ్యతను లెక్క వేయడంలో భాగంగా రానున్న అక్టోబరు నెలలో మరోసారి జిల్లాలో పర్యటిస్తామన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితోపాటు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు.
కారు డ్రైవర్‌కు రెండేళ్లు జైలు శిక్ష
గుంటూరు లీగల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు 5వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కోలారు లత మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2021లో పేరేచర్ల జంక్షన్ వద్ద భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు డ్రైవర్ మాలంపాటి శ్రీకాంత్ రెడ్డి ఢీకొట్టాడు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గుంటుపల్లి వెంకటేశ్వరరావు మృతిచెందగా, ఆయన భార్య తీవ్రగాయాలపాలైంది. ఈఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. సాక్షాధారాలతో జిల్లా ఐదో అదనపు సివిల్ కోర్టులో సమర్పించగా, పూర్వపరాలు, సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి కె.లత ముద్దాయికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఏపీపీ ఎ.పవన్ కుమార్, కోర్టు పర్యవేక్షణ అధికారి సీఐ నరసింహారావు , అప్పటి దర్యాప్తు అధికారి ఎస్సై నరహరిలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.