
డ్రైడేతో డెంగీ నివారణ
నరసరావుపేట: డెంగీ దోమల నివారణకు ప్రతి ఒక్కరూ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ పనికిరాని వస్తువులు, తొట్లలో ఉండే నీటిని పూర్తిగా మార్చాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. మంగళవారం జాతీయ డెంగీ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డాక్టర్ రవి మాట్లాడుతూ డెంగీ వ్యాధి వైరస్ వలన ఒకరి నుంచి మరొకరికి ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా వస్తుందన్నారు. ఈ దోమ మంచినీటిలో పెరుగుతుందన్నారు. ఇళ్లలో నిల్వుండే మంచినీటిలో గుడ్లు పెట్టి తన సంతానాన్ని వృద్ధి చేస్తాయన్నారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్రరత్నాకర్ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా పిల్లలకు కాళ్లు, చేతులు కప్పేలా పూర్తిగా డ్రస్ వేయాలని, పడుకునే సమయంలో దోమతెరలు తప్పకుండా వాడటం చేయాలని సూచించారు. జ్వర లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని అన్నారు. తొలుత కార్యాలయంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ రాజేశ్వరి, ఏఎంఓ చుక్కా వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి