అమ్మో.. ఇంటింటికా? | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఇంటింటికా?

Jul 2 2025 5:41 AM | Updated on Jul 2 2025 5:41 AM

అమ్మో.. ఇంటింటికా?

అమ్మో.. ఇంటింటికా?

హామీలకు మంగళం.. ప్రశ్నిస్తే ఏం చెప్పగలం?

సాక్షి, నరసరావుపేట: అలవిగాని హామీలు, అసత్యప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయకపోగా, అప్పటివరకు ప్రజలకు అందుతున్న సేవలు, పథకాలను అటకెక్కించారు. ముఖ్యంగా సూపర్‌–6 లో పేర్కొన్న పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత జిల్లా అయిన పల్నాడులో రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబు నేటి నుంచి టీడీపీ నేతలను సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ పేరుతో ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేయాలని ఆదేశించారు. ఏడాది పాలనలో మనం ఏం సాధించామని ఇంటింటికి తిరగాలని ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. పర్యటనలో ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని అంతర్మథనంలో ఉన్నారట.

ఏడాదిగా మొహం చాటేసి...

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తరువాత జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా ఉంటున్నారు. గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నిత్యం ఏదో కార్యక్రమం పేరట ప్రజల్లోనే ఉండేవారు. వారి కష్టసుఖాలను ఇంటింటికి వెళ్లి తెలుసుకొని సత్వరమే పరిష్కారం చూపారు. కూటమి ప్రభుత్వంలో ఏడాది కాలంలో ఎమ్మెల్యేలు పల్లెల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పల్లెలకన్నా విదేశాలకే ఎక్కువ వెళ్లారని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలను వదలి ప్రజలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నిస్తున్నారు.

అభివృద్ధి జాడేది...?

ఏడు దశాబ్దాలుగా పల్నాటి ప్రజల కల వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం. గతంలో ఎంతో మంది నేతలు అనుకున్నా ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ, వన్యప్రాణ సంరక్షణ వంటి కీలక అనుమతులను కేంద్రం నుంచి తేవడంలో సఫలీకృతం కాలేకపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరికపూడిశెల ప్రాజెక్టు అనుమతులపై ప్రత్యేక దృష్టిపెట్టి కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి కీలక అడుగువేశారు. మొదటి దశ పనులను ప్రారంభించారు. అంతలో ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్‌ పడింది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చంద్రబాబు మొదలు స్థానిక నేతల వరకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీలిచ్చారు. అయితే ఏడాదైనా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ప్రజలు వాపోతున్నారు.

● జలజీవన్‌ మిషన్‌, వైఎస్సార్‌ కరువు నివారణ పథకం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి

● ఏడాదైనా జేజేఎం పనులు పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందించలేకపోతున్నారు

● కీలకమైన జాతీయ రహదారుల పనులు ముందుకుసాగడం లేదు. ముఖ్యంగా నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి భూసేకర నేటికీ పూర్తికాలేదు

● మాదిపాడు బ్రిడ్జి పూర్తి చేయలేదు

● పల్నాడు జిల్లాకే తలమానికమైన పిడుగురాళ్ల మెడికల్‌ కళాశాల భవితవ్యం కూటమి ప్రభుత్వంలో అయోమయంలో పడింది. సుమారు 50 ఎకరాల్లో రూ.540 కోట్లతో కడుతున్న కళాశాల నిర్మాణ పనులలో కీలకమైనవి గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా పూర్తికావొచ్చాయి. మిగి లిన అరకొర పనులు పూర్తిచేసేందుకు ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేక పూర్తికావడంలేదు. ఎప్పుటి నుంచి ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తాయి, మెడికల్‌ విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభం ఎప్పుడు అన్న వాటికి సమాధానాలు లేవు. ఈ నేపథ్యంలో ఏడాది పాలనలో మీరు సాధించిన అభివృద్ధి ఏమిటని కూటమి నేతలను ప్రజలు ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో కూటమి ప్రజాప్రతినిధుల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి వెళ్లడానికి ఆలోచనలో పడ్డారు.

మహిళల్లో ఆగ్రహ జ్వాలలు

కూటమి ప్రభుత్వ పాలనపై ముఖ్యంగా మహిళలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సూపర్‌–6లో మహిళలకు ప్రకటించిన హామీలను ఏడాది పాలనలో గాలికి వదిలేశారు. ముఖ్యంగా మహిళలకు నెలా నెలా రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైందో ఎప్పుడు అమలు చేస్తారో చెప్పడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జీవితకాల ఆలస్యంగా నడుస్తోంది. ఉచిత సిలెండర్లు పథకం అమలు చేస్తున్నామని చెబుతున్నా నగదు బదిలీ సక్రమంగా జరగడంలేదు.. విచారణ కోసం ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబర్లు పనిచేయవు.

టీడీపీ ఎమ్మెల్యేలలో అంతర్మథనం నేటి నుంచి సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఏడాది దాటినా అమలుకు నోచుకోని హామీలు ప్రజాప్రతినిధుల పనితీరుపై సర్వత్రా విమర్శలు ఏడాదిగా పెండింగ్‌లో వరికపూడిసెల, మెడికల్‌ కళాశాల పనులు తీవ్ర సంక్షోభంలో మిర్చి, పొగాకు, కంది రైతులు అతీగతీ లేని అన్నదాత సుఖీభవ పెండింగ్‌లో ధాన్యం కొనుగోలు నగదు ప్రజలు నిలదీస్తారేమోనని భయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు

రోడ్డెక్కిన రైతన్న

వ్యవసాయం ఏడాదిగా తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంది. ముఖ్యంగా మిర్చి, పత్తి. పొగాకు, కంది పంటల రైతులకు గిట్టుబాటు ధరలు లేక మార్కెటింగ్‌ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోయారు. రోడ్డెక్కి తమకు విత్తనాలు, ఎరువులు కావాలని, పండించిన పంటలను కొనుగోలు చేయాలని, గిట్టుబాట ధర కల్పించాలని రైతులు నిరసనలు చేపట్టడానికే ఏడాది సరిపోయింది. మరోవైపు రైతులకు అన్నదాత సుఖీభవ పేరిట ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్న సాయంలో తొలి ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో ఏడాదీ ఇప్పటివరకు అతీగతీ లేదు. పంటలు పెట్టి అప్పులపాలైన రైతులకు పెట్టుబడి పెట్టడానికి కూడా డబ్బులు లేక ఖరీఫ్‌ సాగు నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యం డబ్బులు నేటికీ వారి ఖాతాల్లో జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా రూ.6 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగులు, విద్యార్థులు కూటమి ప్రభుత్వం తమను పూర్తిగా వంచించిదని తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement