
‘మిషన్ ఉన్నతి’తో రైల్వే ఉద్యోగులకు మేలు
లక్ష్మీపురం: ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి, కార్యాచరణ కొనసాగింపునకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుంటూరు డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పట్టాభిపురం కార్యాలయంలో మంగళవారం ‘మిషన్ ఉన్నతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మిషన్ ఉన్నతి కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించేలా కీలకమైన స్థానాలను భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులు స్వయంగా వారి జూనియర్లకు పదోన్నతి ఉత్తర్వులను అందజేయిస్తున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో ఆయా విభాగాలలో ఆరుగురు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందగా వారి చేతుల మీదుగా వారి తరువాత విధులు నిర్వహించే సిబ్బంది పదోన్నతులు పొందడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఏడీఆర్‌ఎం సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఎఫ్‌ఎం అమూల్య బి.రాజ్ పాల్గొన్నారు.