ఆర్‌ఎంపీ వద్దే అన్ని సేవలు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ వద్దే అన్ని సేవలు

Jul 2 2025 5:41 AM | Updated on Jul 2 2025 5:41 AM

ఆర్‌ఎ

ఆర్‌ఎంపీ వద్దే అన్ని సేవలు

యడ్లపాడు: కనీస వైద్య శిక్షణ లేని ఈ వ్యక్తులు ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్‌ ఇచ్చి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పల్లె ప్రజల అమాయకత్వం, చదువులేని స్థితి వీరికి అవకాశంగా మారింది. కొందరు మెడికల్‌ షాపుల యజమానులే ఇప్పుడు గ్రామాల్లో డాక్టర్ల అవతారం ఎత్తి, రోగులకు వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఫార్మసీ కోర్సులు చేసినవారు కొందరైతే, సదరు కోర్సు పూర్తి చేసిన వ్యక్తుల నుంచి సర్టిఫికెట్లు సేకరించి, మెడికల్‌ షాపులు నడిపేవారు మరికొందరు. ఇలా మెడికల్‌ షాపులు పెట్టుకున్నవారు అక్కడే మందులు, ఇంజెక్షన్లు, సైలెన్లు ఇస్తూ, క్రమంగా ఆ షాపులను చిన్నపాటి ఆసుపత్రులుగా మార్చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో నిరాదరణ, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యపరీక్షల రూపంలో జరిగే ఆర్థిక దోపిడీకి భయపడి నిరుపేద, మధ్యతరగతి ప్రజలు వీరిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.

కమీషన్ల దందా: ప్రైవేట్‌ ఆసుపత్రుల అండదండలు

కొందరు ఆర్‌ఎంపీల దందా కేవలం మందుల అమ్మకాలకే పరిమితం కాలేదు. రోగులకు పరీక్షలు అవసరమైతే నిర్దిష్ట ల్యాబ్‌లకు పంపి, భారీగా కమీషన్లు దండుకుంటున్నారు. ఆర్‌ఎంపీ వైద్యం, మెడికల్‌షాప్‌, ల్యాబ్‌లు, రిఫరల్‌ సేవలు అన్నీ కలిసి మెడికల్‌ సిండికేట్‌ మాఫియాలా నడుస్తున్నాయని బహిరంగ రహస్యమే. కరోనా సమయంలో సైకిళ్లపై తిరిగి వైద్యం చేసిన ఆర్‌ఎంపీలు ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగడమే ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

మందుల షాపులే మినీ ఆస్పత్రులు అద్దెకు దొరుకుతున్న ఫార్మసీ సర్టిఫికెట్లు గ్రామాలు, పట్టణాల్లోభారీగా ఆర్‌ఎంపీ క్లినిక్‌లు పట్టించుకోని జిల్లా వైద్యశాఖ

జగ్గాపురంలో బాలిక మృతి ఒక ఉదాహరణ మాత్రమే...

ఆర్‌ఎంపీ వైద్యం ఎంత ప్రమాదకరమో జగ్గాపురం బాలికకు ఇటీవల యడ్లపాడులో జరిగిన విషాదకర ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. బొంతు కోటేశ్వరరావు కుమార్తె శాలిని(9) అనే బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌ సమస్య ఉండగా ఎలాంటి పరీక్షలు లేకుండా వైద్యం చేయడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణకు వెళ్లిన వైద్యాధికారులే అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో బయటపడింది. అలా చేయకుండా సెటిల్‌మెంట్‌లతో వెలుగు చూడని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఆర్‌పీఎం సంఘాలు, మెడికల్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ యూనియన్లు రంగంలోకి దిగి వివాదాలను సద్దుమణిగేలా చూస్తాయి. వీటిపై నిత్యం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారంటూ ప్రజల నుంచి విమర్శలు వినవస్తున్నాయి.

ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి

ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చట్టం మేరకు ఆర్‌ఎంపీలు ప్రిస్క్రిప్షన్స్‌ రాయటం, ఇంజక్షన్లు చేయడం, సైలెన్స్‌ పెట్టడం వంటి ఇన్‌ఫెషెంట్‌ సేవలు అందించరాదు. ప్రథమ చికిత్సకు సర్టిఫికెట్‌ ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆర్‌ఎంపీలపై చర్యలు తప్పవు. జగ్గాపురంలో బాలికకు వైద్యం వికటించి ఆస్పత్రిలో చేరినట్లు తెలియగానే యడ్లపాడులోని సదరు మెడికల్‌ షాపును మూత వేయించాం. నిర్వాహకుడిపై కేసు నమోదైంది.

– బి రవి, జిల్లా వైద్యాధికారి పల్నాడు

ఆర్‌ఎంపీ వద్దే అన్ని సేవలు 1
1/1

ఆర్‌ఎంపీ వద్దే అన్ని సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement