
ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ మొత్తాలను చెల్లించాలి
ఈయూ రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు
నరసరావుపేట: ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రావాల్సిన గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ సెటిల్మెంట్ మొత్తాలను వెంటనే ప్రభుత్వం చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో 36 ఏళ్లు డ్రైవర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.కోటేశ్వరరావు అభినందన సభ డిపో ఆవరణలో మంగళవారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన దామోదరరావు మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వైద్యసౌకర్యాలు కల్పించేందుకు విలీనంకు ముందున్న రెమ్స్ స్కీమ్ కల్పించాలని, అదేవిధంగా 11వ పీఆర్‌సీ బకాయిలు, డీఏ అరియర్స్ కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా పదవీ విరమణ చేస్తున్న కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
డిపో కార్యదర్శి చందు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా మాజీ డీపీటీఓ యన్‌వీ. శ్రీనివాసరావు, డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు యూనియన్ రాష్ట్ర నాయకులు యం.హనుమంతరావు, కె.నాగేశ్వరరావు, యం.డి.ప్రసాద్, జి.నారాయణరావు, కృష్ణారావు, కోటేశ్వరరావు, జోనల్ నాయకులు వాకా రమేష్, బాబు సామ్యూల్, బెజవాడ రవి, జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్యదర్శి జి.తిరుపతిరావు, గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కరిముల్లా, విజయ్‌కుమార్, బాపట్ల జిల్లా కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అన్ని డిపోల నాయకులు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.