
అమ్మ ఆరోగ్యంపై కత్తి
సాక్షి, నరసరావుపేట: పంటి బిగువన నొప్పిని భరించి, ప్రసవవేదనను అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కాసులు కక్కుర్తి వల్లనో, నొప్పులు భరించలేమనో, ముహూర్తాల ప్రకారం జన్మనివ్వాలనో చాలా మంది మాతృమూర్తులకు సిజేరియన్లు చేసి బిడ్డను భూమిపైకి తెస్తున్నారు. దీంతో అవసరం ఉన్నా, లేకున్నా కాన్ను కోతలు పెరిగిపోతున్నాయి. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. వాస్తవంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలి. ఇది మొత్తం కాన్పుల్లో 25 శాతానికి మించకూడదు. అయితే పల్నాడు జిల్లాలో ఇది 55 శాతం పైగా ఉంటోంది. ప్రభుత్వ వైద్యశాలలో జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7,451 ప్రసవాలు జరగగా అందులో 3,801 మందికి సిజీరియన్ చేశారు. ప్రైవేట్ వైద్యశాలల్లో అయితే ఇది 60 శాతం దాకా ఉంటోంది.
కాన్పుకు వెళితే కోతే...
సుఖ ప్రసవానికి వీలు లేనప్పుడు, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడే సిజేరియన్లు చేయాలి. కానీ కొంతమంది వైద్యులు ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్నారు. సంపాదనే లక్ష్యంగా కొన్ని ప్రైవేట్ వైద్యశాలలు తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని, పురిటి నొప్పుల బాధ భరించలేరని పేర్కొంటూ బాధిత బంధువులను భయపెట్టి అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. సిజేరియన్ ప్రసవాలు తరచూ కడుపు నొప్పి, ఇన్‌ఫెక్షన్, అధిక బరువు, నెలసరి వంటి సమస్యలకు కారణమవుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణ ప్రసవాలతో ప్రయోజనాలు
సాధారణ ప్రసవాల వల్ల తల్లి, పిల్లలకు బహుళ ప్రయోజనాలు అందుతాయి. సాధారణ ప్రసవాల్లో మహిళలు రెండు రోజుల్లోనే ఎప్పటిలా పనులు చేసుకోవడానికి వీలుంటుంది. రెండో కాన్పుపై దుష్ప్రభావం ఉండదు. గర్భసంచికి ప్రమాదం ఉండదు. భవిష్యత్తులో రుగ్మతలకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పుట్టిన బిడ్డకు సైతం మొదటి గంటలో తల్లిపాలు అందించవచ్చు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల తీరు
సంవత్సరం మొత్తం సిజేరియన్లు అసిస్టెడ్ ప్రసవాలు
2022–23 6,594 3,045 64
2023–24 7,631 3,766 118
2024–25 7,451 3,801 114
తల్లీ బిడ్డలకు నష్టం
జిల్లాలో పెద్ద సంఖ్యలో సిజేరియన్లు
పల్నాడులో 55 శాతానికి
పైగా ఆపరేషన్లే..
రోజురోజుకు తగ్గుతున్న
సాధారణ ప్రసవాలు
కాసుల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో
అధిక భాగం సిజేరియన్లే
నొప్పుల భయం, మంచి ముహూర్తాల
కోసం ఒత్తిడి చేస్తున్న గర్భిణులు,
కుటుంబ సభ్యులు
తల్లుల ఆరోగ్యంపై పెను ప్రభావం..
శిశువులకూ నష్టం
సిజేరియన్ల సంఖ్య అదుపులో
ఉంచేందుకు చర్యలు
తీసుకుంటున్నామన్న డీఎంహెచ్‌ఓ
ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఎక్కువగా జరుగుతున్న సిజేరియన్ల వల్ల తల్లికి, బిడ్డకు అధిక నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు తాగితే అవి అమృతంతో సమానం అంటున్నారు. శస్త్ర చికిత్సల కారణంగా మొదటి గంటలో తల్లిపాలు తాగే వీలు లేకుండా పోవడంతో శిశువు ఎదుగుదల, అనంతరం జీవితాంతం అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. రక్తస్రావం అధికమైనా, ఇతరత్రా సమస్యలు తలెత్తినా ప్రాణాపాయంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్టు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. దీంతో అప్పుడప్పుడు తీవ్ర కడుపు నొప్పి సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సందర్భాల్లో గర్భ సంచి తొలగించే పరిస్థితి ఏర్పడవచ్చు.