
పంటలకు బీమా చేయించుకోండి
నరసరావుపేట రూరల్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో మిరప, కంది, వరి పంటలను ఖరీఫ్ సీజన్‌కు ఎంపిక చేసినట్టు సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని పమిడిపాడు, కేతముక్కల అగ్రహారం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ ఐ.శాంతిలు పాల్గొని పత్తి పంటను పరిశీలించి సస్యరక్షణ చర్యలను వివరించారు. ఏడీఏ మాట్లాడుతూ రైతులు పంటలకు బీమా చేసుకోవాలన్నారు. మిరపకు ఎకరానికి రూ.360, వరికి రూ.80, కందికి రూ.40 బీమా ప్రీమియంను చెల్లించి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వ్యవసాయ సహాయకులు అశోక్, పవన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
లక్ష్మీనారాయణకు
పీఆర్కే పరామర్శ
సత్తెనపల్లి: తన చావుతోనైనా పోలీసుల అరాచకాలు ఆగాలని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించి వైద్యశాలలో చికిత్స పొందుతున్న రాజుపాలెం మండలం పెద్దనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), సత్తెనపల్లి సమ న్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డిలు బుధవారం పరామర్శించారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మనస్థాపానికి గురైన లక్ష్మీనారాయణ పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం పాఠకులకు విధితమే. నాయకులు మాట్లాడుతూ అధైర్య పడవద్దని, అండగా ఉంటామని, ప్రశాంతంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా వారికి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపాడు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల శివారెడ్డి, జిల్లా వలంటరీ విభాగం అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో
మొహర్రం వేడుకలు
పొన్నూరు: మత సామరస్యానికి ప్రతీక అయిన మొహర్రం పండుగ వేడుకలను పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. హజరత్ మొహమ్మద్ మనుమలు హజరత్ ఇమామే హసన్, హజరత్ ఇమామే హుస్సేన్ త్యాగాలను స్మరిస్తూ వేడుకలు జరుపుకొన్నారు. ఏడవ రోజు బుధవారం ప్రధాన రహదారిలోని పీర్ల చావిడిలో హజరత్ అలీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మొల్లా ముజావర్ల కమిటీ మొల్లా కరీమ్, మొల్లా హైదర్, మొల్లా గబ్బర్ బాషా, మొల్లా సంధాని, మొల్లా నజీర్, షేక్ , ఖాదర్, మొల్లా అల్లాబక్షి, మొల్లా నజుముద్దీన్, మొల్లా ఖాలీల్ బాషా, మొల్లా బాజి, షేక్ గౌస్, మొల్లా రహంతుల్లా, మొల్లా ఆర్షద్, మొల్లా జలీల్, మొల్లా ఇమ్రాన్, మొల్లా జైనులాబద్దీన్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడి బదులు భార్య విద్యా బోధన
పెనుమర్రు(వేమూరు): మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడి నిర్వాకంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా జవ్వాది శ్రీనివాసరావు ఉండగా, ఆయన తన భార్యను తీసుకొచ్చి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా తంతు జరుగుతున్నా విద్యా శాఖ అధికారులు ఇంతవరకు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఉపాధ్యాయుడు, అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా శ్రీనివాసరావు స్థానంలో ఆయన భార్య పాఠాలు బోధించడం గమనించిన స్థానికులు ఆమెను నిలదీశారు.

పంటలకు బీమా చేయించుకోండి

పంటలకు బీమా చేయించుకోండి