
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు అవసరం
నరసరావుపేట: నీళ్లు, దోమల ద్వారా వచ్చే వ్యాధుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటూ అవి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా మలేరియా అధికారి కె.రవీంద్ర రత్నాకర్ అధ్యక్షతన జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సబ్ యూనిట్లలో నూతనంగా చేరిన 65మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వారికి కేటాయించిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వ్యాధులు సంభవిస్తే తక్షణమే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఎంఎల్‌హెచ్‌పీలకు సహాయ సహకారాలు అందజేస్తూ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు. రవీంద్ర రత్నాకర్ మాట్లాడుతూ నవంబరు వరకు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, పైలేరియా, మెదడువాపు వ్యాధులు లాంటి సీజనల్ వ్యాధులు విషయంలో ఫ్రైడే డ్రైడేను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. దోమల నిర్మూలనతో పాటు అవి పుట్టకుండా, కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్ నజీరు, ఏఎంఓ చుక్కా వెంకటేశ్వర్లు, కుంచాల శ్రీనివాసరావు, సబ్‌యూనిట్ అధికారులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి