
అడుగడుగునా అడ్డగింత
నరసరావుపేట రూరల్: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు చేసిన మోసంపై యువత కన్నెర్ర చెసింది. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వ మోసాలతో నష్టపోయిన యువత, విద్యార్థులు పోరుబాట కార్యక్రమంలో పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కార్యక్రమానికి తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరి గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొనుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
హామీలన్నీ నెరవేర్చాల్సిందే..
నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ నేతలు దుయ్యబట్టారు. ఒక్క సంవత్సరంలోనే దాదాపు రూ.7200కోట్లు నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం బకాయి పడిందని వాటన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, ఏడాదైనా జాబ్ క్యాలెండర్ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కొన్ని కాలేజీల్లో పరీక్షలకు సైతం విద్యార్థులను అనుమతించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం కల్పించుకుని వెంటనే యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుండా యువాగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుందని నినదించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని నినదించారు. ఎస్పీ కార్యాలయం వద్దకు ర్యాలీ చేరుకున్న సమయంలో పోలీసులు బారికేడ్‌లతో అడ్డుకున్నారు. 50మందికే అనుమతిస్తామని చెప్పడంతో నాయకులు, యువత, విద్యార్థులు ముందుకు కదిలారు. వీరు వెళ్లిన తరువాత పోలీసులు బారికేడ్‌లు అడ్డుపెట్టారు. దీంతో యువత, విద్యార్థులు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

అడుగడుగునా అడ్డగింత